శివాజీకి ఔట్ లుక్ నోటీసులు జారీ అవుతాయా?

Update: 2019-05-11 06:11 GMT
టీవీ నైన్ వ్యవహారంలో నమోదు అయిన కేసుల్లో విచారణకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసినా… ఆ అభియోగాలను ఎదుర్కొంటున్న ఇద్దరు ప్రధాన వ్యక్తులూ కూడా విచారణకు హాజరు కావడం లేదు! ముందుగా వీరు పరారీలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. తను పరారీలో లేనట్టుగా రవి ప్రకాష్ ప్రకటించుకున్నారు. టీవీ నైన్ తెర మీదకు వచ్చి తను అందుబాటులోనే ఉన్నట్టుగా  ఆయన చెప్పుకొచ్చారు.

అయితే తను పోలీసుల విచారణకు మాత్రం హాజరు కావడం లేదట. తనకు పది రోజుల సమయం కావాలంటూ ఆయన కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి రవి ప్రకాష్ ఇప్పుడప్పుడే ఈ వ్యవహారంలో పోలీసుల ముందుకు వచ్చే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు.

రవి ప్రకాష్ సంగతలా ఉంటే.. ఇదే వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న శివాజీ మాత్రం ఊసులో లేడు. ఆయన ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. తన పై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తనకేం పట్టనట్టుగా అతడున్నాడు.

అయితే అతడి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శివాజీ విచారణకు హాజరవుతాడా?  కాడా? అనే దానిపై మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి.

ఈ చర్చల్లో వినిపిస్తున్న మాట.. శివాజీపై ఔట్ లుక్ నోటీసులు జారీ కావొచ్చు అని. తనపై వచ్చిన ఆరోపణలపై తప్పించుకునే క్రమంలో ఆయన దేశం దాటి వెళ్లిపోవచ్చనే లెక్కలతో పోలీసులు అతడిపై ఔట్ లుక్ నోటీసును జారీ చేసే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఏం జరగనుందో! తను మీడియా ముందుకు వచ్చి శివాజీ వివరణ ఇస్తాడా?
Tags:    

Similar News