హోదాపై ఇపుడు న్యాయ‌స్థానం నిర్ణ‌యించాలి

Update: 2016-10-18 16:58 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా కేటాయింపులో మ‌రో కీల‌క‌ ప‌రిణామం చోటుచేసుకుంది. ప్రత్యేక హోదా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం దాదాపుగా వెన‌క్కు త‌గ్గిన నేప‌థ్యంలో హైకోర్టులో పిల్ దాఖ‌లైంది. రాఫ్రానికి ప్రత్యేక హోదా కోరుతూ సినీ న‌టుడు శివాజీ హైకోర్టులో వేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్నికోర్టు  స్వీకరించింది. ఈ ప‌రిణామం ప‌ట్ల‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

పిల్ స్వీక‌రించిన నేప‌థ్యంలో రామకృష్ణ స్పందిస్తూ ప్ర‌త్యేక హోదా విష‌యంలో రెండు నాల్కల దోర‌ణి అవ‌లంభించే వారికి ఇది చెంప పెట్టని అన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ తదనంతరం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని విమ‌ర్శించారు.  ప్రత్యేక హోదాను సాధించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం చిత్తశుద్ధి చూపకపోవడం దుర్మార్గమ‌ని మండిప‌డ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రం ద్రోహపూరిత వైఖరి అవలంభిస్తున్నప్ప‌టికీ ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీకి వంతపాడడం ఆయన అవకాశవాదానికి పరాకాష్ట్ర అని రామ‌కృష్ణ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తున్నామని అంటున్న కేంద్రం దాన్ని కూడా అమలు చేయ‌కుండా కాకి లెక్కలు చెబుతోందని ఆయ‌న మండిప‌డ్డారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా అత్యంత ఆవశ్యమ‌ని రామ‌కృష్ణ‌ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ హీరో శివాజీ హైకోర్టులో వేసిన పిల్‌ను విచారణకు స్వీకరించినందుకు సీపీఐ హర్షం వ్యక్తం చేస్తున్నదని ఆయ‌న తెలిపారు. కోర్టులోనైనా రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు రామ‌కృష్ణ వివ‌రించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మరోమారు అందరం కలిసి పనిచేద్దామని ప్ర‌తిపాదించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News