వసతుల్లేక విషాన్ని అందుకే వాడున్నారట

Update: 2015-08-20 04:50 GMT
ఆరోగ్యానికి మేలు చేస్తాయని తినే పండ్లను.. విషంతో పక్వానికి వచ్చేలా చేసే పద్ధతి పై హైకోర్టు కన్నెర్ర చేయటం తెలిసిందే. దీని మీద విచారణ జరిపిన హైకోర్టుకు వ్యాపారుల తరఫున న్యాయవాదులు చేసిన వాదన వింతగా.. విచిత్రంగా.. బరితెగింపునకు పరాకాష్ఠగా కనిపించటం ఖాయం. పండ్ల వ్యాపారుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది గంగయ్యనాయుడు తన వాదనల్లో.. కాయల్ని మగ్గబెట్టేందుకు సరైన సదుపాయాలు లేని గత్యంతర పరిస్థితుల్లో కార్బైడ్ వాడాల్సి వస్తోందని.. తమకున్న సమాచారం ప్రకారం అధికారుల తనిఖీల సమయంలో పలు దుకాణాల్లో పండ్లే లేవని పేర్కొన్నారు.

అంతేకాదు.. సిగరెట్ ప్యాకెట్ మీద పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుందని.. అవి కూడా మార్కెట్ లోనే అమ్ముతున్నారు కదా అని వాదించారు. దీనిపై తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘మీరు కూడా కార్బైడ్ వాడిన పండు అని అమ్మండి. ఎంతమంది కొంటారో చూద్దాం. పండ్ల వ్యాపారుల పనికి మీరెలా మద్దతు పలుకుతారు. కార్బైడ్ నిషేధం ఉన్నా.. ఎక్కడ నుంచి వస్తుందో వ్యాపారులు చెప్పాలి’’ అని ప్రశ్నించారు.

దీనికి స్పందించిన న్యాయవాది సమాధానం ఇస్తూ.. కార్బైడ్ పై నిషేదం ఉందన్న సంగతి తనకు తెలీదని.. సీజనల్ గా టన్నుల కొద్ది కాయలు మార్కెట్ కు వస్తుంటాయని.. వాటిని వెంటనే పక్వానికి తెచ్చి అమ్మకానికి సిద్ధం చేయాల్సి వస్తోందని.. లేని పక్షంలో అవన్నీ చెడిపోతాయన్నారు.

దీనికి స్పందించిన ధర్మాసనం.. ‘‘ఉగ్రవాదులు ఎదురుగా వచ్చి హతమారుస్తారు. కాయల్లో కార్బైడ్ వినియోగించే వ్యాపారులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరం’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక.. ఏపీ అధికారులు చేపట్టిన తనిఖీలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో కోర్టు ఆదేశాలు జారీ చేసిన ఆరు గంటల వ్యవధిలోనే పండ్ల మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారని ప్రశంసించింది. మొత్తంగా పండ్లను అక్రమ పద్ధతిలో పక్వానికి తీసుకొస్తూ.. ప్రజారోగ్యానికి సవాలు విసురుతున్న పండ్లపై హైకోర్టు మొదలు పెట్టిన యుద్ధం వ్యవస్థలో మార్పులను తీసుకొస్తే అంతకు మించి కావాల్సిందేముంది..?
Tags:    

Similar News