109 రోజుల‌ని చెప్పి 9 రోజుల్లో పూర్తి చేశారా?

Update: 2019-07-23 05:19 GMT
ఏమైనా స‌రే ఆ ప‌ని చేయాలంటే క‌నీసం 109రోజులు త‌ప్ప‌నిస‌రంటూ లెక్క‌లు మొత్తం విప్పి చెప్పిన వైనాన్ని అనూహ్యంగా 9 రోజుల్లో పూర్తి చేస్తే ఏం జ‌రుగుతుంది?  ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. ఎంత గొప్ప అంటూ అభినంద‌న‌లు వెల్లువెత్తుతాయి. కానీ.. కేసీఆర్ స‌ర్కారుకు మాత్రం అందుకు భిన్నంగా చివాట్లు ప‌డ్డాయి. అంతేనా.. స‌మాధానాలు చెప్ప‌లేని రీతిలో ఉక్కిరిబిక్కిరి అయ్యే ప‌రిస్థితి. ఇంత‌కీ ఏ విష‌యంలో.. ఎందుకా ప‌రిస్థితి అన్న విష‌యంలోకి వెళితే..

కేసీఆర్ స‌ర్కారు ప‌నితీరుపై పంచ్ లు ప‌డ్డాయి. రాష్ట్ర హైకోర్టు వేసిన ఆక్షింత‌లు ఇప్పుడు ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారాయి. అదే స‌మ‌యంలో ప‌లువురు వేలెత్తి చూపేలా  చేశాయి. ఇటీవ‌ల కాలంలో త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్న‌ట్లుగా బుక్ అవుతున్న కేసీఆర్ స‌ర్కారుకు తాజా ప‌రిణామం మ‌రింత ఇబ్బంది క‌లిగించేదిగా చెప్పాలి.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. మున్సిపల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు ద్వంద వైఖ‌రే తాజా ప‌రిస్థితికి కార‌ణం.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో మొన్నామ‌ధ్య వ‌ర‌కూ వెనువెంట‌నే సాధ్యం కాద‌ని.. చాలా స‌మ‌యం అవ‌స‌ర‌మ‌ని చెప్ప‌ట‌మే కాదు.. లెక్క‌లు వేసి 109 రోజుల క‌స‌ర‌త్తు లేనిదే ఓట‌ర్ల జాబితా పూర్తి కాదంటూ కోర్టుకు చెప్పేసింది తెలంగాణ స‌ర్కారు. దీనిపై స్పందించిన న్యాయ‌స్థానం ఇంత స‌మ‌య‌మా? అన్నప్ప‌టికి ప్ర‌భుత్వం నుంచి సానుకూల‌త వ్య‌క్తం కాలేదు.

అనూహ్యంగా ఇప్పుడేమో 109 రోజులు ప‌ట్టే ప్రాసెస్ ను కేవ‌లం తొమ్మిది రోజుల్లో పూర్తి చేసేసిన‌ట్లుగా నివేదిక ఇవ్వ‌టంతో హైకోర్టు అగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అంత తొంద‌రేమొచ్చిందంటూ ప్ర‌శ్నించింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క‌మైన ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌.. త‌ప్పుల ప‌రిహ‌ర‌ణ‌.. కొత్త జాబితా ప్ర‌చుర‌ణ‌.. ఇలా ఒక్కో ప్ర‌క్రియ‌కు పూర్తి అయ్యేందుకు స‌మ‌యం లెక్క‌క‌ట్టి.. మొత్తం 109 రోజులు క‌నీసం కావాల‌ని అడిగి.. ఇప్పుడేమో కేవ‌లం 9 రోజుల్లో ప్ర‌క్రియ మొత్తం పూర్తి అయ్యింద‌ని ఎలా చెబుతారు?

అప్పుడేమో అంత సుదీర్ఘ ప్ర‌క్రియ అని చెప్పి.. ఇప్పుడేమో ఆఘ‌మేఘాల మీద ఎందుకు పూర్తి చేశారు? అని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. ప్ర‌జాస్వామ్యం హైజాక్ అయ్యింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని.. అభ్యంత‌రాల‌న్నింటికి స‌మాధానాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన అభ్యంత‌రాల్లో ఎన్నింటిని ప‌రిష్క‌రించాలో లెక్క‌లు చెప్పాల‌ని కేసీఆర్ స‌ర్కారును ప్ర‌శ్నించింది. దీంతో.. పూర్తి వివ‌రాల్ని కౌంట‌ర్ రూపంలో దాఖ‌లు చేస్తామ‌ని చెప్ప‌టంతో ఈ నెల 29 వ‌ర‌కు కేసు విచార‌ణ‌ను వాయిదా వేసింది. త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు త‌గ్గ‌ట్లు పావులు క‌దిపే కేసీఆర్ స‌ర్కారుకు హైకోర్టు తాజా వ్యాఖ్య‌లు ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

ప్ర‌స్తుతం త‌న‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఉన్న వేళ‌లోనే మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌టం ద్వారా రాజ‌కీయ ల‌బ్థి పొందాల‌నుకున్న గులాబీ బాస్ కు హైకోర్టు తాజా రియాక్ష‌న్ షాకింగ్ గా మార‌క త‌ప్ప‌ద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అందుకే అనేది.. ఏదైనా ఒక మాట చెప్పే ముందు.. కాస్త ఆలోచించి చెప్పాల‌ని. ఈ విష‌యాన్ని కేసీఆర్ ఇప్ప‌టికైనా అర్థం చేసుకుంటారా?
Tags:    

Similar News