హైకోర్టులో కేసీఆర్ కు ఊర‌ట‌!

Update: 2018-10-12 15:50 GMT
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల న‌గారా మోగిన నేప‌థ్యంలో అక్క‌డ రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. అయితే, స‌భ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలకు స‌మాచారం ఇవ్వ‌కుండా అసెంబ్లీ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమంటూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దాంతోపాటు - ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై కూడా ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. దీంతో, వాటి విచార‌ణ‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ స‌ర్కార్ కు హైకోర్టు ఊర‌ట నిచ్చింది. అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్దమంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు శుక్ర‌వారం నాడు కొట్టివేసింది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా అసెంబ్లీ ర‌ద్దైన‌ 6 నెలలలోపు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉన్నందున ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ తరఫున న్యాయవాది హైకోర్టు కు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశామని - అభ్యంతరాలుంటే నామినేషన్ చివరి రోజు సాయంత్రం 3 గంటల వరకు తెలియజేయ‌వ‌చ్చని తెలిపారు. దీంతో, ఓటర్ల నమోదు ప్రక్రియను తామే పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. మ‌రోవైపు - హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ నెల 31న మరోసారి తమ వాదనలు వినిపిస్తామన్నారు. ఓట‌ర్ల జాబితాలో అధికారులు చేసిన‌ తప్పుల‌ను రుజువు చేస్తామ‌ని అన్నారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని కాంగ్రెస్ నేత మర్రి శశిథర్ రెడ్డి పేర్కొన్నారు. తప్పులను బయటపెట్టడానికే తాము కోర్టుకు వెళ్లామని స్పష్టం చేశారు. ఓట‌ర్ల జాబితా వ్య‌వ‌హారంలో ఈ నెల 31న జ‌ర‌గ‌బోతోన్న విచారణపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ ఏర్పడింది.
Tags:    

Similar News