జగన్ కు షాకిచ్చిన హైకోర్టు.. రంగులపై కీలక తీర్పు

Update: 2020-03-10 07:12 GMT
స్థానిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ప్రభుత్వ తీరు విరుద్ధంగా ఉందని చెబుతూ హైకోర్టు తీర్పు వెలువరించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైఎస్సార్సీపీ పార్టీ రంగులపై సోవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పంచాయతీ భవనాలకు వేసిన రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో జగన్ కు ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.

ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలకు వైఎస్సార్సీపీ పార్టీ రంగులు వేయడాన్ని పలువురు తప్పుబట్టారు. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. రేపొద్దున ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను లబ్ధి పొందిన వారి నివాసాలకు కూడా పార్టీ వేస్తారేమోనని ఎద్దేవా చేశారు. తాజాగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై కొందరు హైకోర్టు లో పిటీషన్ వేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఆ పిటీషన్ ను విచారించిన హైకోర్టు తీర్పు ఇచ్చింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

పది రోజుల అనంతరం ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించి కొత్తగా రంగులు వేసినట్లు కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుచేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో తమకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. దీంతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలకు వేసిన వైఎస్సార్సీపీ రంగులు తొలగించనున్నారు. దీనిపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ హైకోర్టు తీర్పు జగన్ కు చెంపదెబ్బ అని అభివర్ణిస్తున్నారు.
Tags:    

Similar News