హైకోర్టులో కేసీఆర్‌ కు మ‌రో మొట్టికాయ‌

Update: 2017-09-12 11:22 GMT
టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వానికి ఉమ్మ‌డి హైకోర్టులో తాజాగా పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలింది. గ‌తంలోనూ అనేక విష‌యాల్లో కోర్టు నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కొన్న కేసీఆర్‌ ప్ర‌భుత్వానికి ఇప్పుడు మాత్రం అత్యంత కీల‌క విష‌యంలో మొట్టికాయ‌లు ప‌డ‌డం తీవ్ర ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించింది. రాష్ట్రంలో రైతుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం అందుబాటులో ఉండేలా.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేలా చూడ‌డ‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా రైతు స‌మ‌న్వ‌య స‌మితుల‌ను ఏర్పాటు చేశారు.

దీనికిగాను ఆయ‌న జీవో-39ని విడుద‌ల చేశారు. ఈ స‌మితులు రైతుల నుంచి ధాన్యం త‌దిత‌ర పంట‌ల‌ను సేక‌రించి, వారికి ధ‌ర‌ల విష‌యంలోనూ సాయం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స‌మితుల ఏర్పాటుపై రాజ‌కీయంగా అప్ప‌ట్లోనే పెద్ద‌ దుమారం రేగింది. టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు ఉపాధి క‌ల్పించేందుకే కేసీఆర్ ఈ ఎత్తుగ‌డ వేశార‌ని విప‌క్షాలు ఆరోపించారు. ఈ క్ర‌మంలో ఈ జీవోను స‌వాలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ మనోహర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  దీనిని హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది.

మంగ‌ళ‌వారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్ త‌ర‌ఫు లాయ‌ర్ రచనా రెడ్డి  వాదిస్తూ..  రైతు సంఘాల ఏర్పాటు వెనుక రాజ‌కీయ ల‌బ్ధి ఉంద‌ని కోర్టుకు తెలిపారు. నాయకుల కమీషన్ల కోసమే జీవో -39 ను తీసుకొచ్చారని అన్నారు. జీవో 39తో రెవెన్యూ వ్యవస్థ బలహీన పడుతుందని వాదించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేసేలా ఆదేశించాల‌ని కోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్ట్‌ రైతు సమితులకు విడుదల చేసిన రూ.500 కోట్లను ఏవిధంగా ఖర్చు చెస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రూ.500 కోట్ల నుంచి ఎలాంటి చెల్లింపులు జరపొద్దంటూ సూచించింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ ప‌రిణామం కేసీఆర్ కు తీవ్ర శ‌రాఘాతంగా ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
Tags:    

Similar News