ఈ ముగ్గురు... కేసీఆర్‌ కు చుక్క‌లు చూపిస్తున్నారే

Update: 2019-05-16 14:15 GMT
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ కు గ‌ట్టి షాక్ ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్సీ... ఇప్పుడు ఆ పార్టీ అధినేత‌ - సీఎం కేసీఆర్ కు నిజంగానే చుక్క‌లు చూపిస్తున్నార‌ని చెప్పాలి. త‌న పార్టీ టికెట్ల‌పై ఎమ్మెల్సీలుగా విజ‌యం సాధించిన రాములు నాయక్ - యాదవరెడ్డి - భూపతిరెడ్డిలు... ప‌ద‌వీ కాలం ముగియ‌కుండానే వైరి వ‌ర్గంలో చేరిపోయార‌ని, దీంతో వారి ప‌ద‌వులు ర‌ద్దైపోయాయ‌న్న కోణంలో ఆ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కేసీఆర్‌ రంగం సిద్ధం చేశారు. అయితే నాడు పార్టీ మారి కేసీఆర్‌ ను ఇరుకున పెట్టిన ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు.. ఇప్పుడు కోర్టులోనూ కేసీఆర్ కు చుక్క‌లు చూపిస్తున్నారు.

తాము పార్టీ మార‌నే లేద‌ని - అలా తాము పార్టీ మారిన‌ట్టుగా టీఆర్ ఎస్ ఆరోపిస్తే... అందుకు త‌గ్గ ఆధారాలు చూప‌మంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు నేడు హైకోర్టులో జ‌రిగిన విచార‌ణ‌లో ఏకంగా స‌వాల్ విసిరారు. దీంతో నిజంగానే ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయిన కేసీఆర్ స‌ర్కారు.. వారు ముగ్గురు పార్టీ మారిపోయార‌ని - ఆధారాలు చూపేందుకు కొంత స‌మ‌యం కావాల‌ని గ‌త విచార‌ణ‌లో కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే నేటి విచార‌ణ‌లోనూ మ‌రోమారు వాయిదా పాట పాడింది. అధికార పార్టీగా ఉంటూ వాయిదాల మీద వాయిదాలు ఎలా కోరతార‌ని - అయినా ఆధారాలుంటే స‌మ‌ర్పించేందుకు ఇంకెంత స‌మ‌యం కావాల‌ని చీవాట్లు పెట్ట‌డంతో పాటుగా ఇంకా స‌మ‌యం ఇచ్చే ప్ర‌సక్తే లేద‌ని కోర్టు తేల్చి చెప్పింది.

అంతేకాకుండా ఈ ముగ్గురి స్థానాల‌కు ఇప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కేసీఆర్ స‌ర్కారు అభ్య‌ర్థ‌న మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం రంగం సిద్ధం చేయ‌గా... దానిని కూడా ఆపేయాలంటూ కోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. వ‌చ్చే నెల 3 దాకా ఈ మూడు స్థానాల‌కు షెడ్యూల్ విడుద‌ల చేయ‌రాద‌ని ఈసీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ల‌పై గెలిచిన ఎమ్మెల్యేల‌ను య‌ధేచ్ఛ‌గా పార్టీలోకి చేర్చుకున్న కేసీఆర్‌... త‌న పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన నేత‌ల‌ను చూస్తే మాత్రం అట్టుడికిపోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయితే త‌న పార్టీలోకి నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా చేరిన వారిని కాపాడుకుంటూ వ‌స్తున్న కేసీఆర్‌... త‌న పార్టీ నుంచి ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిన నేత‌ల‌ను మాత్రం ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పుడు కేసీఆర్ కు టిట్ ఫ‌ర్ ట్యాట్ అన్న రీతిలో ద‌మ్మంటే ఆధారాలు చూపాలంటూ ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు విసిరిన స‌వాల్ తో కేసీఆర్ కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌న్న మాట వినిపిస్తోంది.

   

Tags:    

Similar News