వారి మ‌ర్మాంగాలు క‌మిలిపోవ‌టానికి కార‌ణం ఏమిటి?

Update: 2017-09-06 06:12 GMT
తీవ్ర సంచ‌ల‌నంగా మారిన నేరెళ్ల బాధితులపై పోలీసుల హింసాకాండ ఎంత దారుణ‌మ‌న్న విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా కోర్టు వెల్ల‌డించింది. ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు అడిగిన ప్ర‌శ్న‌ల‌తో నేరెళ్ల బాధితులపై పోలీసులు జ‌రిపిన ఆరాచ‌కం ఎంత‌న్న‌ది తెలిసిన‌ప్పుడు షాక్ తిన‌టం ఖాయం.

తాజాగా ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్య‌లు వింటే.. నేరెళ్ల బాధితుల న‌ర‌క‌యాత‌న ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల .. రామ‌చంద్రాపురం గ్రామాల్లోని ద‌ళితుల‌పై పోలీసులు దాడి చేయ‌టం..వారిని తీవ్రంగా హింసించిన వైనం బ‌య‌ట‌కువ‌చ్చి సంచ‌ల‌నమైంది. దీనిపై ఇప్ప‌టికే కోర్టు తీవ్రంగా ప్ర‌శ్నించ‌టం.. పోలీసుల తీరును తప్పు ప‌ట్టేలా కొన్ని సందేహాలు వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే.

తాజాగా ఈ అంశాన్ని హైకోర్టు మ‌రోసారి విచారించింది. ఈ సంద‌ర్భంగా హైకోర్టు న్యాయ‌మూర్తులు స్పందిస్తూ.. నేరెళ్ల బాధితులంద‌రికీ ర‌హ‌స్య ప్ర‌దేశాల్లోనే ఎందుకు గాయాల‌య్యాయి?   వారి మ‌ర్మాంగాలు క‌మిలిపోవ‌టానికి కార‌ణం ఏమిటి?  బాధితులంద‌రికి ఒకే త‌ర‌హాలో గాయాలు ఎలా అయ్యాయి?  సిరిసిల్ల ఏరియా ఆసుప‌త్రి వైద్యులు చికిత్స చేసి ఇచ్చిన నివేదిక‌కూ.. జైలు వైద్య అధికారుల వైద్య నివేదిక‌కూ వ్య‌త్యాసం ఎందుకు ఉంది? అంటూ హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌మేశ్ రంగ‌నాథ‌న్‌.. న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జె. ఉమాదేవిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది.

రెండు నివేదిక‌ల్లోని అంశాల్ని బేరీజు వేస్తూ ఒక టేబుల్ రూపంలో నివేదిక‌ను అంద‌జేయాల‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ దేశాయ్ ప్ర‌కాశ్ రెడ్డిని ఆదేశించింది. కోర్టు లేవ‌నెత్తిన సందేహాల‌కు స‌మాధానమిచ్చే క్ర‌మంలో అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ స్పందిస్తూ.. రెండు వైద్య నివేదిక‌ల్లో తేడాలు ఉన్న విష‌యాన్ని అంగీక‌రించారు. కేసు ద‌ర్యాఫ్తు పేరుతో బాధితుల‌పై ఎస్ ఐ అతిగా స్పందించార‌ని.. ప‌రిధి దాటి కొట్టార‌ని.. అందుకే ఆ అధికారిని స‌స్పెండ్ చేసిన‌ట్లు కోర్టుకు చెప్పారు. తొలుత బాధితుల‌కు గాయాలు లాఠీఛార్జ్ కార‌ణంగా జ‌రిగిన‌ట్లు పోలీసులు.. ప్ర‌భుత్వం చెప్పింది. అయితే.. కోర్టు విచార‌ణ పుణ్య‌మా అని అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. చివ‌ర‌కు ప్ర‌భుత్వ న్యాయ‌వాది సైతం పోలీసుల అతిని అంగీక‌రించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు. మొత్తంగా నేరెళ్ల బాధితులకు జ‌రిగిన అన్యాయం.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారుకు ఒక మ‌చ్చ‌లా మారే అవ‌కాశం ఉంద‌న్న భావ‌న ప‌లువురి నోట వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News