ప్ర‌ముఖ ఐటీ కంపెనీకి హైకోర్టు నోటీసులు

Update: 2017-07-11 04:33 GMT
ప్ర‌ముఖ ఐటీ కంపెనీ టెక్ మ‌హీంద్ర‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కంపెనీ ఉద్యోగుల తొల‌గింపు విష‌యంలో ఆ కంపెనీ అనుస‌రిస్తున్న వైఖ‌రిపై తాజాగా తెలంగాణ రాష్ట్ర కార్మిక‌.. ఉపాధి క‌ల్ప‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి.. రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ కూ హైకోర్టు తాఖీదులు పంపింది. టెక్ మ‌హీంద్ర‌లో ఉద్యోగుల తొల‌గింపు అంశంపై సుద్దాల అశోక్ స‌హా మ‌రో ముగ్గురు హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈ అంశంపై జ‌స్టిస్ రామ‌చంద్ర‌రావు ఈ రోజు (సోమ‌వారం) విచార‌ణ జ‌రిపారు.

పిటీష‌న‌ర్ల త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది స‌త్యప్ర‌సాద్ వాద‌న‌లు వినిపించారు. టెక్ మ‌హీంద్ర కంపెనీ ప‌లువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాల‌ని ఒత్తిడి చేస్తోంద‌ని పేర్కొన్నారు. ఉద్యోగం వ‌దులుకోవ‌ట‌మో.. సెల‌వుల‌పై వెళ్లాల‌ని ఒత్తిడి చేయ‌ట‌మో చేస్తుంద‌న్నారు.

కంపెనీ తీరుపై రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు చేశాక కూడా కంపెనీ ఉద్యోగుల్ని తొల‌గించింద‌న్నారు. కార్మిక శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ చ‌ర్య‌లు తీసుకునే లోపే కంపెనీ ఉద్యోగుల్ని తొల‌గించ‌టం స‌రికాద‌ని.. చ‌ట్టంలోని నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫిర్యాదు పెండింగ్‌లో ఉన్న‌ప్పుడు తొల‌గింపు త‌ప్ప‌ని పేర్కొన్నారు.

ఇటీవ‌ల కాలంలో ప‌లు ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా తొల‌గిస్తున్నాయి. నెల వ్య‌వ‌ధిలో కార్మిక శాఖ క‌మిష‌న‌ర్ వ‌ద్ద 80 పిటీష‌న్లు దాఖ‌లైన‌ట్లుగా పేర్కొన్నారు.

ఫిర్యాదుదారుల త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి.. పిటీష‌న్‌ను విచార‌ణ‌కు అనుమ‌తిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ కేసులో ప్ర‌తివాదులుగా ఉన్న టెక్ మ‌హీంద్ర కంపెనీతో పాటు తెలంగాణ కార్మిక శాఖ అధికారుల‌కు నోఈసులు జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Tags:    

Similar News