కోర్టు ధిక్కరణ ఎఫెక్టు.. ఇద్దరు తెలంగాణ కలెక్టర్లకు జైలుశిక్ష వేసిన హైకోర్టు

Update: 2021-03-03 04:04 GMT
సంచలన తీర్పును వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కలెక్టర్లకు మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. కోర్టు ధిక్కారణకు సంబంధించి తాజాగా ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అంతగిరి రిజర్వాయర్ భూసేకరణ వ్యవహారంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ డి. క్రిష్ణభాస్కర్.. అప్పటి జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా.. భూసేకరణ అధికారి ఎన్.శ్రీనివాసరావులకు మూడు నెలల సాధారణ జైలు.. రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది. యాస్మిన్ బాషా ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

అంతేకాదు పదకొండు మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున కోర్టు ఖర్చుల కింద చెల్లింపులు జరపాలని ఆదేశించింది. ఇలాంటి తీర్పునకు కారణమైన వివాదం ఏమిటి? అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 69.22 ఎకరాలు.. 257.37 ఎకరాల భూసేకరణ నిమిత్తం 2017లో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టలేదని.. గ్రామసభలు నిర్వహించలేదని.. అభ్యంతరాల్ని స్వీకరించలేదని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా  భూములను 2019లో ముంపునకు గురి చేయటంతో రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. చట్టప్రకారం పునరావాస అవార్డును ప్రకటించామని ప్రభుత్వం తెలిపింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇళ్లకు చెందిన స్థలాల సేకరణకు పునరావాస పరిహారం చెల్లించారే కానీ పునరావాస ప్యాకేజీ చెల్లించలేదన్నారు.

అంతేకాదు.. భూములను ముంపునకు గురి కాకుండా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ముంపునకు గురి చేయటం కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని.. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను అనుమతిస్తూ ప్రతివాదులైన ముగ్గురికి మూడు నెలల సాధారణ జైలుశిక్ష.. జరిమాన తీర్పును హైకోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అయితే.. అప్పీలు చేసుకోవటానికి వీలుగా ఈ తీర్పును నిలిపివేశారు. దీంతో.. జైలుశిక్ష అమలు కాదు కానీ.. వారి సర్వీసు రికార్డుల్లో దీన్ని నమోదు చేస్తారు.
Tags:    

Similar News