కరోనా దోపిడీ: ప్రైవేట్ ఆస్పత్రులకు హైకోర్టు నోటీసులు

Update: 2020-07-07 14:00 GMT
కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై హైకోర్టులో పిటీషన్లు దాఖలు కావడంతో హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ నోటీసులు వెళ్లాయి.

మంగళవారం ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్ లోని ప్రముఖ టాప్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది.. చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది శ్రీకిషన్ శర్మ హైకోర్టులో పిల్ వేశారు. కరోనా చికిత్సలు, చార్జీల్లో పారదర్శకతపై ప్రైవేట్ ఆస్పత్రులకు మార్గదర్శకాలు జారీ చేయాలని పిటీషనర్ కోరారు. ఈ క్రమంలోనే బిల్లు చెల్లించలేదని డీఎంఓను డిశ్చార్జ్ చేయని ఆస్పత్రిపై ఏం చర్య తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా రోగుల చికిత్స ఖర్చును తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. సాధారణ చికిత్స కోసం రోజుకు 4,000 రూపాయలు, వెంటిలేటర్ లేకుండా ఇంటెన్సివ్ కేర్ యూనిట్-ఐసియులో చికిత్స కోసం 7,500 రూపాయలు.. వెంటిలేటర్‌తో ఐసియు చికిత్స కోసం 9,000 రూపాయలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆదేశాన్ని ఉల్లంఘిస్తున్నాయని.. కరోనా రోగులనుంచి అధికంగా వసూలు చేస్తున్నాయని పిటిషనర్ వాదించారు.

కరోనా పరీక్షలు, చికిత్సలు నిర్వహించడానికి ప్రైవేట్ ఆస్పత్రులు - డయాగ్నొస్టిక్ ప్రయోగశాలలను అనుమతించాలని మే 20 న తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే చేయడం అప్రజాస్వామికమని పేర్కొంది.దీంతో తెలంగాణ సర్కార్ ప్రైవేటుకు అనుమతులు ఇచ్చింది. వాటిల్లో దోపిడీ తాజాగా బయటపడుతోంది. లక్షలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

దీనిపై తాజాగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో పలు ప్రైవేటు ఆస్పత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈనెల 14లోగా వివరణ ఇవ్వాలని కోరింది.
Tags:    

Similar News