జంప్ జిలానీ మంత్రులకు హైకోర్టు ఝలక్

Update: 2017-07-19 04:26 GMT

జంప్ జిలానీ మంత్రుల‌కు షాక్ త‌గిలింది. ఒక పార్టీ నుంచి గెలిచి మ‌రో పార్టీలో చేరి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన వారికి న్యాయ‌స్థానంలో గ‌ట్టి ఎదురుదెబ్బ ప‌డింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఎన్నికై తెదేపాలో చేరి మంత్రులుగా పనిచేస్తుండటంపై కోర్టు నోటీసులు జారీ చేసింది. వైకాపా నుంచి ఎన్నికై తెదేపాలో మంత్రులుగా కొనసాగుతున్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - వైకాపాతో సహా మంత్రులు ఆదినారాయణరెడ్డి - ఎస్ కృష్ణ రంగారావు - ఎన్ అమరనాథ్‌ రెడ్డి - భూమా అఖిలప్రియను నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఒక పార్టీ నుంచి గెలిచిన వారు ప్ర‌భుత్వంలో చేరి మంత్రులుగా  పని చేయడం రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంటూ శివప్రసాద రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ - జస్టిస్ టి రజనితో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆనంద కుమార్ కపూర్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ నిబంధనల ప్రకారం పార్టీ ఫిరాయించిన వారు చట్టసభల్లో సభ్యులుగా కొనసాగడానికి వీల్లేదన్నారు. పార్టీ ఫిరాయించిన వారు మంత్రి పదవుల్లో కొనసాగడం రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు. రాజ్యాంగంలోని 164 (1బి) అధికరణకు ఇది విరుద్ధమని వాదించారు. మంత్రివర్గంలో ఎవరినైనా తీసుకునే హక్కు సీఎంకు ఉందని, కాని పార్టీ ఫిరాయించిన వారిని సిఎం సిఫార్సు చేస్తే, వారిని గవర్నర్ మంత్రులుగా నామినేట్ చేశారని, ఇదంతా రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ డి.రమేష్ తెలంగాణ ప్రభుత్వం కూడా టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ ను మంత్రిగా నియమించారనే పిటిషన్‌ ను 2015లో దాఖలు చేశారని కోర్టుకు వివరించారు. దీంతో కోర్టు జోక్యం చేసుకుని పార్టీని ఫిరాయించిన కేసులన్నింటికీ ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించి, ప్రభుత్వంలో చేరిన కేసులన్నింటినీ కలపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
Tags:    

Similar News