త‌ల‌సాని..ఇదేం ప‌ని?

Update: 2015-11-13 06:37 GMT
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్య‌వ‌హారం రాష్ర్ట ప్ర‌భుత్వానికి ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ కు భ‌లే త‌ల‌నొప్పిగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్‌ ఎస్‌ లో చేరి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న తీరుపై ప్ర‌తిప‌క్షాలు - రాజ‌కీయవ‌ర్గాలు విమ‌ర్శ‌లకు తోడు కోర్టులు మొట్టికాయ‌లు వేయ‌డం మ‌రింత ఇబ్బందిగా మారుతోంది. తాజాగా హైకోర్టు మ‌రోమారు నోటీసులు జారీ చేయ‌డం ఈ విష‌యానికి ఆజ్యం పోసింది

తంగెళ్ల శివప్రసాద్‌ రెడ్డి అనే వ్య‌క్తి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారని, ఆయనపై అనర్హత వేటు వేసే విధంగా ఆదేశించాలని కొరుతూ రిట్ పిటీషన్‌ ను దాఖలు చేశారు. ఆ పిటీషన్‌ ను స్వీకరించిన హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయ‌వాది వాదిస్తూ మంత్రి తలసాని తెలుగుదేశం తరపున ఎన్నికై టీఆర్‌ ఎస్‌ లో చేరారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గంలో స్ధానం కల్పించారని అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని మంత్రి తలసాని రాజీనామా లేఖ స్పీకర్ పరిధిలో ఉందని గుర్తు చేసింది. స్పీకర్ ఈ విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. స్పీకర్ రాజీనామాను అంగీకరించినప్పుడే మంత్రి పదవిలో తలసాని కొనసాగే విషయం చర్చకు వస్తుందని పేర్కొంది.

అయితే తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్‌ ఎస్‌ లోకి పార్టీ ఫిరాయించి తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా మంత్రిగా కొనసాగుతున్నారో తెలియచేయాలని మంత్రిని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా మంత్రి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేర‌కు కోర్టు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కు నోటీసులు ఇచ్చింది. త్వ‌ర‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీరియ‌ల్‌ ను త‌లపిస్తున్న ఈ ప‌రిణామం టీఆర్ ఎస్‌ కు ఇబ్బందిని క‌లిగించేదే.
Tags:    

Similar News