న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఆ పబ్బులకు షాకిచ్చిన హైకోర్టు..!

Update: 2022-12-30 12:50 GMT
2022 ఏడాదికి గుడ్ బై చెప్పి 2023 సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి మరొక రోజే సమయం ఉంది.  ఈ క్రమంలోనే యువత మొత్తం కొత్త సంవత్సర వేడుకలు చేసుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రెండు రోజుల ముందు నుంచే కొత్త సంవత్సర వేడుకలు సందడి మొదలైంది.

అయితే కరోనా భయాందోళనల నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

న్యూ ఇయర్ సందర్భంగా పబ్బులు.. రెస్టారెంట్లు.. హోటల్స్.. తదితర వ్యాపార సంస్థలన్నీ రాత్రి ఒంటి గంటకు వరకు నిర్వహించుకునే అవకాశం ఉండనుంది. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించిన నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్ పరిధిలో పది పబ్బులకు తెలంగాణ హైకోర్టు షాకివ్వడం చర్చనీయాంశంగా మారింది.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జూబ్లీ హిల్స్.. బంజారా హిల్స్ పరిధిలోని 10 పబ్బుల్లో రాత్రి పది గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ అనుమతి లేదంటూ హైకోర్టు స్పష్టం చేసింది. పబ్ లపై గతంలో హైకోర్టు ఆదేశాలివ్వగా న్యూ ఇయర్ సందర్భంగా పబ్ నిర్వాహకులు మరోసారి కోర్టు ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను శుక్రవారం హైకోర్టు విచారించింది.

ఈ సందర్భంగా పబ్బుల అనుమతి విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. కొత్త సంవత్సర వేడుకల్లో పబ్ నిర్వాహకులు ఈ నిబంధనలే పాటించాలని సూచించింది. రాత్రి 10గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News