కోడి పందెమా... కోర్టుతో పందెమా

Update: 2016-12-29 08:07 GMT
కోస్తా జిల్లాల్లో కోడి పందేలు అధికార పార్టీ నేత‌లు - అధికారుల‌కు భ‌యం పుట్టిస్తున్నాయి. సంప్ర‌దాయాల పేరుతో పందేల‌కు సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌జ‌లు... తీవ్ర హెచ్చ‌రిక‌లు చేస్తున్న కోర్టు మ‌ధ్య న‌లిగిపోతున్నామ‌ని వారు అంటున్నారు. కోడిపందాలపై సుదీర్ఘ విచారణానంతరం హైకోర్టు జారీచేసిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇర‌కాటంలో పెడుతున్నాయి. ముఖ్యంగా హోం మంత్రి చినరాజప్ప - డిజిపి సాంబశివరావులకు ఇది సంక‌టంగా మారింది. వీటిపై ఉక్కుపాదం మోపాలంటూ ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్నాదేశించింది. ఎక్కడా కోడిపందాలు జరక్కుండా చూడాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. పందాలు జరిగితే ఆ బాధ్యత ప్రభుత్వానిదేనంటూ కూడా న్యాయస్థానం తేల్చిచెప్పింది. మరోవైపు కోస్తా జిల్లాల్లో ఈ పందాల్లేకుండా సంక్రాంతి పండుగ జ‌ర‌గ‌డం అసాధ్యం.

ఒకప్పుడు సంప్రదాయ క్రీడగా ఉన్న కోడిపందాలిప్పుడు వందలు.. వేల కోట్ల క్రీడగా పరిణమించాయి. గోదావరి జిల్లాల్లో పండుగ మూడ్రోజులూ వందలకోట్లలో పందాలు కాసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్నుంచే కాదు… విదేశాల్నుంచి కూడా ఇక్కడికి తరలొస్తున్నారు. గతేడాదైతే విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఏకంగా 1300కోట్ల విలువైన పందాలు కాసినట్లు అంచ‌నా. ఇంత భారీ స్థాయికెదిగిన ఈ సంప్రదాయ క్రీడకు పార్టీ బేధాల్లేకుండా నాయకులంతా కొమ్ముకాస్తున్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి ముందు పందాలపై పలు వివాదాలు రాజుకోవడం రివాజుగా వస్తోంది. అయితే సంక్రాంతి వచ్చే నాటికి స్థానిక నేతల ఒత్తిళ్ళకు మంత్రులు - ప్రభుత్వం దిగిరాకతప్పడంలేదు. పైకి కత్తులు - పందాల్లేకుండా ఈ క్రీడ నిర్వహించుకోమని మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నా వాటినెవరూ పట్టించుకోవడంలేదు. కళ్ళముందే కోట్ల రూపాయలు పందాల రూపంలో చేతులుమారుతున్న కళ్ళప్పగించి చూడ్డం మినహా పోలీసులు మరేం చేయలేక పోతున్నారు. ఇందుక్కారణం పందాల ప్రారంభానికి ముందే స్టేషన్ల వారీగా లక్షలాదిరూపాయల ముడుపులు పోలీసులకంద‌డం.  అన్ని రాజకీయ పార్టీల నాయకులకు స్థాయిని బట్టి నజరానాలు దక్కుతున్నాయి. దీంతో మూడ్రోజులూ పోలీసులు పందాల బ‌రుల‌వైపు వెళ్ళడంలేదు. యదేచ్ఛగా పందాల నిర్వహణకు పరోక్షంగా సహకరిస్తున్నారు.

 అయితే ఇంతవరకు ఉన్న పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. రెండేళ్ళ పాటు సుదీర్ఘ విచారణానంతరం ఈ క్రీడను న్యాయమూర్తులు తప్పుబట్టారు. సంప్రదాయం పేరిట జరుగుతున్న జూదాన్ని ప్రభుత్వమే అరికట్టాలని తేల్చిచెప్పేశారు. దీనిపై ప్రభుత్వం మౌనం వహిస్తున్నా పందాల నిర్వాహకులు మాత్రం కాలుదువ్వుతున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకెళ్ళైనా స్టే ఉత్తర్వులు తెస్తామని హుంకరిస్తున్నారు. మరోవైపు కోర్టుల ఆదేశాలెలా ఉన్నా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోలీసుల్ని రాకుండా చూసేందుకు నిర్వాహకులు సిద్దపడుతున్నారు. ఈ సమాచారాన్ని సేకరించిన ఉన్నత న్యాయస్థానం ఈ విషయంలో చాలా సీరియస్‌ గా వ్యవహరిస్తోంది. ఎక్కడ చిన్నపాటి కోడి పందాల జూదం చోటు చేసుకున్నా పోలీసుల్నే బాధ్యుల్ని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే సంక్రాంతి హోం మంత్రి - డిజిపిల పాలిట శాపంగా మారనుంది.

 పైగా పందేల‌కు మారుపేరైన గోదావ‌రి జిల్లాలకు చెందిన రాజప్ప హోం మంత్రిగా ఆయ‌న ఎటూ చెప్ప‌లేక‌పోతున్నార‌ట‌.  మరో వైపు న్యాయస్థానాలు కూడా అంతే పట్టుదల ప్రదర్శిస్తున్నాయి. అసలే ఈ విషయంపై రెండేళ్ళ క్రితం న్యాయస్థానం ఇదేవిధమైన ఆదేశాలిచ్చింది. దీనిపై కొందరు సుప్రింకోర్టుకెళ్ళారు. తిరిగి హైకోర్టులోనే తేల్చుకోమంటూ సుప్రిం స్పష్టం చేయడంతో రెండేళ్ళ సుదీర్ఘ విచారణ నిర్వహించిన అనంతరం హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. కోళ్ల పందెం ఇలా ఉన్నా కోర్టుతో పందెం ఎలా ఉంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News