చెన్న‌మ‌నేని కాస్తంత రిలాక్స్ అవ్వొచ్చు

Update: 2017-09-12 05:34 GMT
ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌నం సృష్టించిన వేముల‌వాడ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్ పౌర‌త్వం వ్య‌వ‌హారం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. వాస్త‌వాల్ని దాచి పెట్టి పౌర‌స‌త్వం పొందార‌ని.. నిబంధ‌న‌ల మేర‌కే ఆయ‌న పౌర‌స‌త్వాన్ని ర‌ద్దు చేసిన‌ట్లుగా కేంద్రం చెబుతుంటే.. అలాంటిదేమీ లేద‌ని చెన్న‌మ‌నేని చెబుతున్నారు. ఆ మాట‌కు వ‌స్తే.. త‌న పౌర‌స‌త్వాన్ని ర‌ద్దు చేసే విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ‌మే రూల్స్ ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని వాదిస్తున్నారు. త‌న పౌర‌స‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి జారీ చేసిన ఉత్త‌ర్వుల‌పై ఆయ‌న రివ్యూ పిటీష‌న్ దాఖ‌లు చేసుకున్నారు.

దీనిపై రియాక్ట్ అయిన హైకోర్టు.. చెన్న‌మ‌నేని దాఖ‌లు చేసుకున్న రివ్యూ పిటీష‌న్ ను ఆరు వారాల్లో ప‌రిష్క‌రించాల‌న్నారు. అదే స‌మ‌యంలో కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్త‌ర్వుల అమ‌లును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చ‌ట్టం ప్ర‌కారం త‌న పౌర‌స‌త్వాన్ని ర‌ద్దు చేసే స‌మ‌యంలో త‌న‌కు నోటీసు జారీ చేయాల్సి ఉంద‌ని.. ర‌ద్దు నిర్ణ‌యంపై రివిజ‌న్ కోరే హ‌క్కు త‌న‌కు ఉంద‌ని చెన్న‌మ‌నేని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన హైకోర్టు..చెన్న‌మ‌నేనికి ఊర‌ట‌నిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. తాజా ప‌రిణామాల్ని చూస్తే.. చెన్న‌మ‌నేని పౌర‌స‌త్వం ర‌ద్దు వ్య‌వ‌హారం మ‌రికొంత‌కాలం సాగే అవ‌కాశం ఉంద‌ని చెప్పొచ్చు. న్యాయ‌ప‌ర‌మైన అంశాల్లోకి ఈ ఇష్యూ వెళ్లిపోయిన నేప‌థ్యంలో ర‌ద్దుపై స్ప‌ష్ట‌త రావ‌టానికి మ‌రికొంత‌కాలం ప‌ట్టొచ్చు. దీంతో.. ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి ఎలాంటి ఢోకా ఉండ‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయ‌వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం.. ఈ ట‌ర్మ్‌ను చెన్న‌మ‌నేని విజ‌య‌వంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌న్న మాట‌ను చెబుతున్నారు.
Tags:    

Similar News