విటుడికి జరిమానా కాదు.. 'మూడేళ్ల' జైలుశిక్ష..!

Update: 2015-05-26 05:50 GMT
వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయే విటులలో ఒక భరోసా కనిపిస్తుంటుంది. ఎంతోకొంత జరిమానా కట్టి బయటపడొచ్చన్న భావన కనిపిస్తుంది. కానీ..అలాంటివి ఉండవన్న విషయాన్ని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేస్తోంది.

వ్యభిచారానికి వ్యభిచారిణులకు ఎలాంటి శిక్ష విధిస్తారో.. విటులకు కూడా అలాంటి కఠిన శిక్షలే అమలు కావాలన్న మాట హైకోర్టు చెప్పింది.వ్యభిచార గృహాల్లో వ్యభిచారం చేయాల్సి వస్తున్న వారిపై లైంగిక దోపిడీకి పాల్పడినట్లేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలా వ్యభిచారం చేసే విటులపై ఐపీసీ సెక్షన్‌ 370ఎ కింద కేసులు నమోదు చేయాలని పేర్కొంటూ.. ఈ ఉత్తర్వులను అన్ని పోలీసుస్టేషన్లకు పంపాలని సూచించింది.

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులతో పాటు.. ఒక విటుడిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహ నిర్వాహకులపై సెక్షన్‌ 370 ఎ.. పీఐటీ చట్టంలోని 3..4..5..6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో విటుడిపై మాత్రం పీఐటీ సెక్షన్‌ నాలుగు కింద కేసు నమోదు చేశారు.

ఇక్కడ నిర్వాహకులపై నమోదు చేసిన సెక్షన్‌ ఏం చెబుతుందంటే.. ఐపీసీ సెక్షన్‌ 370ఎ ప్రకారం.. బలవంతంగా వ్యభిచారంలోకి దిగిన వ్యక్తి మైనర్‌ అని తెలిసీ.. ఆ వ్యక్తిపై లైంగిక దోపిడీకి పాల్పడిన వారికి కనీసం ఐదేళ్లు.. గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష విధించవచ్చని.. అదే మేజర్లపై అయితే కనీసం మూడేళ్లు.. గరిష్ఠంగా ఐదేళ్లు జైలుశిక్ష.. జరిమానా విధించవచ్చు.

అదే సమయంలో విటుడిపై నమోదు చేసిన సెక్షన్‌ నాలుగు ప్రకారం.. 18 ఏళ్లు నిండిన ఏ వ్యక్తి అయినా.. తనకు తెలిసి మరొకరు చేసే వ్యభిచారం ద్వారా వచ్చే సంపాదనపై పూర్తిగా లేదంటేకొంత భాగం ఆధారపడి జీవిస్తుంటే ఆ వ్యక్తికి రెండేళ్ల వరకూ జైలుశిక్ష.. లేదంటే వెయ్యి రూపాయిల జరిమానా.. లేదంటే రెండూ విధించొచ్చు. ఒకవేళ మైనర్‌తో వ్యభిచారం చేయిస్తూ.. ఆదాయం పొందుతుంటే.. ఆ వ్యక్తికి కనీసం ఏడేళ్లు.. గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలుశిక్ష విధించొచ్చు.

అయితే.. ఇక్కడ విటుడు తనపై నమోదు చేసిన సెక్షన్‌.. తనకు ఏ మాత్రం సంబంధం లేదని.. కేసును కొట్టేయాలని వాదించాడు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. సదరువ్యక్తిపై నమోదు చేసిన సెక్షన్‌ నాలుగు కొట్టేసి.. సెక్షన్‌ 370ఎ కిందకు వస్తారని పేర్కొంది. మొత్తానికి కేసు నుంచి బయటపడాలని భావించిన విటుడికి.. ఒక కేసు పోయి మరో కేసులో చిక్కుకున్నట్లు అయ్యింది. మొత్తంగా వ్యభిచారం చేయటం.. చేయించటం అన్నది జరిమానాలతోనే కాదు.. భారీ జైలుశిక్షకు కారణం అవుతుందన్న విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News