ఎఫైర్ ఉంటే పోలీస్ ఉద్యోగం నుంచి తొలగిస్తారా? హైకోర్టు సంచలన తీర్పు

Update: 2022-02-16 11:35 GMT
వివాహేతర సంబంధం పెట్టుకుంటే పోలీస్ ఉద్యోగం నుంచి తొలగిస్తారా? అని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధం అనేది సమాజం దృష్టిలో అనైతిక చర్య అయినప్పటికీ ఆ కారణంతోనే ఒక వ్యక్తిని వృత్తి నుంచి తొలగించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధంపై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

వివాహేతర సంబంధం పెట్టుకోవడం పోలీసు ప్రవర్తనా నియమాల ప్రకారం దుష్ప్రవర్తనగా పేర్కొనలేమని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. గుజరాత్ కు చెందిన ఓ కానిస్టేబుల్ పెళ్లైనప్పటికీ మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న కారణంగా ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై అతడు హైకోర్టుకు ఎక్కగా కీలక వ్యాఖ్యలు చేసింది.

గుజరాత్ కు చెందిన ఓ కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి సాహిబాగ్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నివసించేవాడు. అదే కాలనీకి చెందిన మరో వితంతు మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి ప్రవర్తనపై అనుమానంతో మహిళ బంధువులు సీసీ కెమెరాలు అమర్చారు.

వివాహేతర సంబంధంపై పక్కా ఆధారాలను సేకరించి మహిళ కుటుంబం 2012లో పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కానిస్టేబుల్ ను ప్రశ్నించగా ఎఫైర్ ను ఒప్పుకున్నాడు. తన అంగీకారంతోనే తమ మధ్య సంబంధం ఏర్పడిందని వితంతు మహిళ పేర్కొంది. దీంతో డిపార్ట్ మెంటల్ విచారణ చేసి 2013లో కానిస్టేబుల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన పోలీస్ శాఖ అతడిని సర్వీస్ నుంచి తొలగించింది. అతడిని పోలీస్ శాఖలో కొనసాగించడం వల్ల చెడ్డపేరు వస్తుందని.. పోలీసులపై ప్రజలకు నమ్మకం పోతుందని అధికార యంత్రాంగం పేర్కొంది.

అయితే తనను తొలగించే ముందు సరైన విచారణ ప్రక్రియను పాటించలేదని కానిస్టేబుల్ కోర్టును ఆశ్రయించగా కోర్టు ప్రస్తుత తీర్పును వెలువరించింది. తొలగింపు ఉత్తర్వులను రద్దు చేసింది. నెలరోజుల వ్యవధిలో కానిస్టేబుల్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది.  అతడి వేతనంలో 25శాతం పెంచాలని సూచించింది.

Tags:    

Similar News