హైకోర్టు బోనులో ఏసీబీ పోలీసు?

Update: 2022-02-16 05:34 GMT
చాలా రోజుల నుంచి పెద్ద‌గా హ‌డావుడి చేయ‌ని శాఖ ఏసీబీ.ఎక్క‌డా ఏ విధమ‌యిన ఆక‌స్మిక త‌నిఖీలూ చేయ‌కుండా, పెద్ద‌గా అవినీతి అధికారుల‌ను ప‌ట్టుకోకుండా, అస్స‌లు వారి ఊసే ఎత్త‌కుండా హాయిగా త‌న ప‌ని తాను చేసుకుంటున్న ఏకైక శాఖ ఏసీబీ. అందుకే అవినీతి అధికారుల క‌థ‌లేవీ వెలుగు చూడ‌డం లేదు. మీడియాలో అస్స‌లు హైలెట్ కావ‌డం లేదు.

దీంతో వివిధ శాఖ‌ల్లో ముఖ్యంగా రెవెన్యూ, ఆర్టీఓ, క‌మర్షియాల్ ట్యాక్స్, ఇంకా ఇత‌ర విభాగాల్లో అవినీతి ఇబ్బడిముబ్బ‌డిగా పెరిగిపోతోంది. కానీ సంబంధిత ద‌ర్యాప్తు అధికారుల్లో మాత్రం అస్స‌లు చ‌ల‌న‌మే లేదు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు కూడా ఏసీబీపై మండిప‌డింది. స‌కాలంలో ఛార్జిషీటు దాఖ‌లు చేయ‌డంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సంబంధిత అధికారుల‌కు మొట్టికాయ‌లు వేసింది. 2018 నాటి కేసుల‌కు సైతం ఇంత‌వ‌ర‌కూ ఛార్జిషీట్లు వేయ‌కుండా ఉండడంపై, సంబంధిత నిర్ల‌క్ష్య వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీనిపై డీజీ విచార‌ణకు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు ఇచ్చింది.

వాస్త‌వానికి ఏసీబీ కేసులు అనేకం ఛార్జిషీట్లు లేకుండానే ముగిసిపోతున్నాయి.అవినీతి అధికారుల‌ను ప‌ట్టుకున్నా కూడా త‌రువాత వారిని కోర్టుబోనుకు తీసుకువెళ్ల‌డంలో ఏసీబీ అధికారులు విఫ‌లం అవుతున్నారు.ఇందుకు రాజ‌కీయ ఒత్తిళ్లు కూడా కార‌ణం అవుతున్నాయి.శాఖ ప‌రంగా అవినీతికి పాల్ప‌డిన అధికారుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసి ఊరుకుంటున్నారే త‌ప్ప అంత‌కుమించి క‌ఠిన చర్య‌లేవీ చేప‌ట్ట‌లేక‌పోతున్నారు.దీంతో క్షేత్ర స్థాయిలో అవినీతికి సంబంధించి నియంత్ర‌ణ చేప‌ట్టేవారే క‌ర‌వవుతున్నారు.

వాస్త‌వానికి నిబంధ‌న‌లు అనుస‌రించి ప్ర‌భుత్యోద్యోగి  ఎవ‌రు అయినా స‌రే కోర్టులో ఛార్జి షీట్ రూపంలో అత‌నిపై అభియోగాలు న‌మోదు చేయాలంటే  సంబంధిత స‌ర్కారు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి! అయితే అనుమ‌తులు ఇచ్చేందుకు రాజ‌కీయ ఒత్తిళ్లు అన్న‌వి కార‌ణం అవుతుండ‌డంతో ఏసీబీ దర్యాప్తు పూర్తిగా మంద‌గిస్తోంది.క‌నుక ఏసీబీ కేసులు పెద్ద‌గా నిరూప‌ణ‌కు నోచుకోవడం లేదు.

అందుక‌నే నిన్న‌టి వేళ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.సంచిలో పిల్లిని బ‌య‌ట‌కు ఎలా తీసుకురావాలో త‌మ‌కు తెలుసు  అని న‌ర్మ‌గ‌ర్భంగా కొన్ని కీల‌క వ్యాఖ్యలు చేసింది.వీటిని విని వ‌దిలేయ‌డం అన్న‌ది ఎప్ప‌టిలానే ఏసీబీ వంతు..అవినీతిని క‌ట్ట‌డి చేయ‌డం అన్న‌ది ఆ శాఖ‌కు చేత‌గాదు ఎన్న‌టికీ అన్న‌ది కూడా నిరూప‌ణే !
Tags:    

Similar News