ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. ఎలక్షన్లకు రెడీ కావాలని ఆదేశాలు

Update: 2019-11-15 12:36 GMT
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో పంచాయతీల కాల పరిమితి ముగిసినా ఇప్పటివరకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చి 13 నెలలు దాటినా ఇంకా ఎందుకు నిర్వహించలేదో చెప్పాలని కోరింది.

కాగా పంచాయతీ ఎన్నికలను వచ్చే ఏడాది మార్చిలోగా నిర్వహిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు, అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు, నిధుల మంజూరు వంటి వాటికి కనీసం 4 నెలల సమయం అవసరమని చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించారు. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని 2018లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, దీనిని అమలు చేయకపోవడం పట్ల క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు.

అప్పటి తీర్పు ప్రతి అందగానే తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. పాత ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు వీలున్నా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆవిధంగా చేయడం లేదన్నారు. 1994 నుంచి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అందుకే బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గుతుందని తెలిపారు. ఇలా చేస్తే లీగల్‌గా ఇబ్బందులు రావచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కార్యదర్శి సత్యరమేష్‌ కూడా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని అమలు చేస్తామన్నారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, గెజిట్‌ నోటిఫికేషన్‌, వంటివి పూర్తి చేసేందుకు సమయం కావాలని ద్వివేదీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కావాలని ఎన్నికలను వాయిదా వేయలేదని, అదే ఏడాది అక్టోబర్‌లో తుపానులు, భారీ వర్షాల కారణంగా నిర్వహించలేకపోయామని చెప్పారు.

రాష్ట్రంలో 12,775 గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఆదేశాలివ్వాలని కోరుతూ తాండవ యేగేష్ అనే లాయర్ హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో కోర్టు విచారణ జరిపింది. రెండు పక్షాల వాదనలు విన్న తరువాత కోర్టు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
Tags:    

Similar News