నేరెళ్ల ఇష్యూపై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం

Update: 2017-08-17 05:17 GMT
వెనుకా ముందు చూసుకోకుండా అత్యంత పాశ‌వికంగా వ్య‌వ‌హ‌రించిన పోలీసుల దాడిపై తాజాగా హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల‌.. రామ‌చంద్రాపురం గ్రామాల్లోని ద‌ళితుల‌పై పోలీసులు దారుణంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. వారిని విప‌రీతంగా కొట్ట‌టం.. భౌతికంగా హింసించిన తీరుపై పోలీసు వ‌ర్గాల‌పై హైకోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది.

పోలీసుల క‌స్ట‌డీలో బాధితుల్ని హింసించ‌కుంటే ఒకేలాంటి దెబ్బలు ఆరుగురికి ఎలా త‌గులుతాయ‌న్న సూటి ప్ర‌శ్న వేసింది. అంతేకాదు.. పోలీసులు త‌ప్పు చేయ‌కుండా ఎస్ ఐని ఎందుకు స‌స్పెండ్ చేశారంటూ వేసిన ప్ర‌శ్న‌కు పోలీసు శాఖ నోట మాట రాకుండా చేసిన కోర్టు.. మ‌రో కీల‌క వ్యాఖ్య‌ను చేసింది. నిందితుల‌ను జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపిన‌ప్పుడు త‌గిలిన దెబ్బ‌ల్ని వారెంట్ లో న‌మోదు చేయాలంటూ జైలు సూప‌రింటెండెంట్ ఎందుకు తిప్పి పంపారో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. ఇలా ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధించిన హైకోర్టు తీరుకు తెలంగాన పోలీస్ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఇష్టారాజ్యంగా ఇసుక‌ను త‌వ్వేస్తూ.. వాయువేగంతో లారీల్ని న‌డుపుతూ ప‌లువురు ప్రాణాలు తీసిన వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేరెళ్ల‌.. రామ‌చంద్రాపురం గ్రామ‌స్తులు.. ఆందోళ‌న‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కొన్ని లారీలు ద‌గ్థ‌మ‌య్యాయి. దీనికి కార‌ణం కొంద‌రంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని దారుణంగా కొట్ట‌టం పెను వివాదంగా మారింది. వారి గాయాల్ని వారెంట్ లో న‌మోదు చేస్తే త‌ప్ప తాను జ్యూడిషియ‌ల్‌క‌స్ట‌డీకి అనుమ‌తించ‌నంటూ జైలు సూప‌రింటెండెంట్ క్వ‌శ్చ‌న్ చేయ‌టంతో నేరెళ్ల బాధితుల గోడు ప్ర‌పంచానికి తెలిసేలా చేసింది.

పోలీసుల తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ పౌర‌హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు గ‌డ్డం ల‌క్ష్మ‌ణ్  కోర్టును ఆశ్ర‌యించిన నేప‌థ్యంలో.. హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌మేశ్ రంగ‌నాథ‌న్‌.. జ‌స్టిస్ జె.ఉమాదేవిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఈ కేసుకు సంబంధించిన నార్త్ జోన్ డీఐజీని సుమోటోగా ఇంప్లీడ్ చేసిన ధ‌ర్మాస‌నం.. ఏ కార‌ణాల‌తో ఎస్ ఐని స‌స్పెండ్ చేశారో చెప్పాలంటూ ఆదేశాలుజారీ చేసింది. ఈ ఇష్యూలో హోంశాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శికి ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. నిందితుల‌కు క‌రీంన‌గ‌ర్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అందించిన చికిత్స వివ‌రాల్ని ఇవ్వాల్సిందిగా కోరింది.

ఈ కేసులో ప్ర‌భుత్వం త‌ర‌పు అద‌న‌పు ఏజీ జె. రామ‌చంద్ర‌రావు వాద‌న‌లు వినిపించారు. కోర్టు ఆదేశాల మేర‌కు వ‌రంగ‌ల్ ఏజీఎం ఆసుప‌త్రి వైద్యుల‌తో క‌మిటీ వేశామ‌ని.. బాధితుల‌కు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన క‌మిటీ నివేదిక ఇచ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. వారి ఆరోగ్యం సాధార‌ణంగానే ఉంద‌ని.. పోలీసు క‌స్ట‌డీలో వారికి గాయాలు కాలేద‌న్నారు. ఘ‌ట‌న జ‌రిగిన రోజు తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయ‌న్నారు. పెద్ద ఎత్తున జ‌నం గుమిగూడార‌ని.. పోలీసుల‌పై రాళ్లు రువ్వార‌న్నారు. ఆ సంద‌ర్భంగా గుంపును చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన‌ట్లుగా పేర్కొన్నారు.

ఈ ద‌శ‌లో కల్పించుకున్న ధ‌ర్మాస‌నం.. పోలీసులు క‌స్ట‌డీలో కొట్ట‌క‌పోతే నిందితులంద‌రికి ఒకే ర‌క‌మైన దెబ్బ‌లు ఎలా త‌గులుతాయ‌ని నిల‌దీసింది. దీనికి బ‌దులుగా అద‌న‌పు ఏజీ వాద‌న‌లు వినిపిస్తూ.. ఎవ‌రికీ తీవ్ర గాయాలు కాలేద‌ని.. వారి ఆరోగ్యానికి ఎలాంటి స‌మ‌స్యా లేద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎస్ ఐ కొంచెం అతిగా స్పందించిన కార‌ణంగా స‌స్పెండ్‌చేసిన‌ట్లు చెప్పారు. ఈ ఘ‌ట‌న జులై2న జ‌రిగితే.. 13 వ‌ర‌కు ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌లేద‌ని.. రాజ‌కీయ జోక్యంతోనే ఈ ఇష్యూ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో పిటీష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది వి. ర‌ఘునాథ్ త‌న వాద‌న‌లు వినిపించారు. అద‌న‌పు ఏజీ వాద‌న‌లు స‌త్య‌దూరంగా ఉన్నాయ‌న్న ఆయ‌న‌.. ఈ కేసులో అస‌లు నిందితులు జిల్లా ఎస్పీఅన్నారు. ఆయ‌న ప్రోత్సాహంతోనే ద‌ళితుల‌ను అరెస్ట్ చేసి క‌స్ట‌డీలో తీవ్ర చిత్ర‌హింస‌లకు గురి చేశార‌న్నారు. ఘ‌ట‌న జ‌రిగి న‌ల‌భై రోజులు అవుతున్న త‌ర్వాత‌కూడా వైద్య ప‌రీక్ష‌లు చేస్తే.. ఇంకా గాయాలు ఉన్న‌ట్లు నివేదిక‌లో ఉన్న విష‌యాన్ని గుర్తు చేశారు. మొత్తంగా నేరెళ్ల ఎపిసోడ్ తెలంగాణ పోలీసు శాఖ‌కు ఇబ్బందిక‌రంగా మారింద‌న్న అభిప్రాయం న్యాయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News