ఉస్మానియా ఆస్పత్రి.. విద్యాహక్కు చట్టంపై హైకోర్టు గరంగరం

Update: 2020-07-23 14:30 GMT
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆస్పత్రి.. విద్యా హక్కు చట్టంపై దాఖలైన పిటిషన్లపై తాజాగా విచారణ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై మండిపడింది. ముఖ్యంగా చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రి భవనంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పురావస్తు భవనమా? కాదా? అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారించింది.

ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై భిన్నవాదనలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ భవనం కూల్చివేయాలని ఓ వాదన ఉండగా, పురాతన భవనమంటూ వాదన ఉందని తెలిపింది. ఈ విషయంపై స్పష్టతనివ్వాలని ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి మరమ్మతుల కోసం గతంలోనే రూ.6 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. మరమ్మతుల పనుల తీరు తెలుసుకుని చెబుతామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ వ్యాజ్యాలపై విచారణ ఆగస్టు 4వ తేదీకి వాయిదా పడింది.

అనంతరం మరో పిటిషన్ పై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడింది. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు కావడం లేదన్న వ్యాజ్యంపైన హైకోర్టు విచారణ చేసింది. విద్యా హక్కు చట్టానికి సంబంధించి 2015 నుంచి పలు వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. విద్యా హక్కు చట్టం అమలుపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.

దీంతోపాటు సచివాలయ భవనాల కూల్చివేతపై కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఈ సచివాలయ కూల్చివేతపై గోప్యత ఎందుకు పాటిస్తున్నారో చెప్పాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం సచివాలయ భవనాల కూల్చివేతకు పరిసర ప్రాంతాలకు ఎవరినీ అనుమతించలేమని కోర్టుకు స్పష్టం చేసింది. సెక్షన్ 180ఈ ప్రకారం ఆ సైట్‌లో పనిచేసేవారు మాత్రమే ఉండాలని పేర్కొంది. కరోనా బులిటెన్‌ మాదిరి కూల్చివేతలపై కూడా బులిటెన్ విడుదల చేయొచ్చు కదా అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
Tags:    

Similar News