ఆర్కే దెబ్బ‌!... కోడెల‌కు హైకోర్టు నోటీసులు!

Update: 2018-04-10 11:46 GMT
తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు రాజ్యాంగ విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించి... విప‌క్షాల‌ను బ‌ల‌హీనం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కొన‌సాగించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ భారీగా పార్టీ ఫిరాయింపుల‌కు తెర తీసిన వైనం మ‌నంద‌రికీ తెలిసిందే. తొలుత తెలంగాణ‌లోనే ప్రారంభ‌మైనా... ఆ త‌ర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ బాట‌లో న‌డిచిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా వైసీపీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల్లో 23 మందిని త‌న పార్టీలోకి లాగేశారు. వీరిలో న‌లుగురు ఎమ్మెల్యేల‌ను త‌న కేబినెట్ లో చేర్చుకుని త‌న‌దైన శైలి పార్టీ ఫిరాయింపుల‌కు తెర తీశార‌ని కూడా పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వైసీపీ... త‌న టికెట్ల‌పై విజ‌యం సాధించి ఆ త‌ర్వాత ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌కుండానే టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారి శాస‌న‌స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేయాల‌ని స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

ఇది జ‌రిగి దాదాపుగా రెండున్న‌రేళ్లు అవుతోంది. ఆ త‌ర్వాత కూడా త‌న ఫిర్యాదును ప‌రిశీలించాల‌ని కోరుతూ ప‌లుమార్లు వైసీపీ శాస‌న‌స‌భాప‌క్షం స్పీక‌ర్‌ కు గుర్తు చేసింది. అయితే స్పీక‌ర్ ప‌రిధిలోని విచ‌క్ష‌ణాధికారాల మేర‌కు ఫిర్యాదుపై ప‌రిశీల‌న జ‌రుపుతామ‌ని చెబుతూ వ‌స్తున్న కోడెల ఇప్ప‌టిదాకా చ‌ర్య‌లు చేప‌ట్టిన దాఖ‌లానే క‌నిపించ‌లేదన్న వాద‌న కూడా లేకపోలేదు. ఈ క్ర‌మంలోనే స్పీక‌ర్ త‌మ ఫిర్యాదు ప‌ట్ల దృష్టి సారించ‌డం లేద‌ని ఆరోపిస్తూ వైసీపీ కీల‌క నేత - గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని తుంగ‌లో తొక్కుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు, మంత్రులపై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో స్పీక‌ర్‌ ఎందుకు తాత్సారం చేస్తున్నారో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న త‌న పిటిష‌న్ లో హైకోర్టుకు విన్న‌వించారు. ఈ పిటిష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు ధ‌ర్మాస‌నం నేడు దానిపై విచార‌ణ చేప‌ట్టింది.

ఈ సంద‌ర్బంగా హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పిటిష‌నర్ వాదిస్తున్న‌ట్లుగా పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌పై ఎందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌న్న విష‌యంపై స‌మాధాన‌మిస్తూ కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని స్పీక‌ర్ కోడెల‌కు నోటీసులు జారీ చేసింది. ఇందుకు స‌మ‌యాన్ని కూడా నిర్దేశించిన కోర్టు... మూడు వారాల్లోగా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల్సిందేన‌ని డెడ్ లైన్ పెట్టింది. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం స్పీక‌ర్ కోడెల‌కు కాస్త ఇబ్బందిక‌ర‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాజ్య‌స‌భ‌లో పార్టీ మారిన ఎంపీల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ రాజ్య‌స‌భ చైర్మ‌న్ స్థానంలో ఉన్న భార‌త ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్యనాయుడు ఇటీవ‌లే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అదే స‌మ‌యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెండున్న‌రేళ్లుగా తాము ఫిర్యాదు చేస్తున్నా స్పీక‌ర్ కోడెల ప‌ట్టించుకోని వైనంపై ఆళ్ల కోర్టుకోక్క‌డం - కోర్టు కూడా స్పీక‌ర్‌ కు నోటీసులు జారీ చేయ‌డం ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకుంద‌నే చెప్పాలి. ఈ వ్య‌వ‌హారంలో స్పీక‌ర్ ఎలా స్పందిస్తారోన‌న్న విష‌యంపై ఆస‌క్తి నెల‌కొంది.
Tags:    

Similar News