ఈడీ జప్తుపై కోర్టుకెళ్లిన జగన్ కు ఊరడింపు

Update: 2016-12-21 05:48 GMT
ఆదాయానికి మించిన ఆస్తులున్న ఆరోపణలతో ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పలు కేసులు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈడీ స్వాధీనం చేసుకున్న జగన్.. ఆయన సతీమణి భారతి ఆస్తులపై ప్రాథమిక జఫ్తు చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకోవటం.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్.. ఆయన సతీమణి భారతి హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంది.

అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వుల నేపథ్యంలో.. బ్యాంకుల్లో ఉన్న తమ డిపాజిట్లు.. ఇతర స్థిర చరాస్తులను బదలాయించుకునేందుకు ఈడీ చేపట్టిన జఫ్తు చర్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్బంగా ఈడీ తొందరపాటుతో వ్యవహరిస్తుందని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు 235 పేజీలు ఉన్నాయని.. వాటిపై రాత్రికి రాత్రే అప్పీలు దాఖలు చేయటం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ తరఫు న్యాయవాది తమ వాదనను వినిపించటంతో పాటు.. గతంలోనూ ఇదే తీరుతో ఈడీ తొందరపాటుతో వ్యవహరించగా.. హైకోర్టు స్టే ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన ఈడీ తరఫు న్యాయవాది.. తాము చట్టానికి అనుగుణంగానే రియాక్ట్ అవుతున్నట్లు వెల్లడించారు. ఇరుపక్షాల వాదన విన్న హైకోర్టు.. ఇప్పటికే బదలాయింపు ప్రక్రియ పూర్తి అయినవి కాక.. మిగిలిన ఆస్తుల విషయంలో తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని ఈడీకి సూచించారు. దీనిపై ఈడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఇలాంటి ఉత్తర్వులు ఒక ఆనవాయితీగా మారి.. పిటీషనర్ తరచూ ఇదే తరహా పిటీషన్లు దాఖలు చేసే అవకాశం ఉందన్న వాదనను వినిపించారు. ఈ వాదనను హైకోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చుతూ.. అడ్డుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే అంటే.. మరుసటి రోజునేనా? అన్న ప్రశ్నతో పాటు.. ఇది అనవసర వివాదమని.. చట్టం అప్పీలుకు 45 రోజులు గడువు ఇచ్చినప్పుడు.. అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేశారు. తాజా పరిణామాలు కొంతలో కొంత జగన్ కు ఊరడింపు కలిగించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News