విద్యుత్తు బదిలీలపై కోర్టు షాక్‌లో కేసీఆర్‌ సర్కార్‌

Update: 2015-06-12 12:44 GMT
        ాజకీయ ప్రత్యర్థులను తనదైన వ్యూహంతో అడ్డంగా బుక్‌ చేస్తూ.. వారు ఊపిరి తీసుకోవటానికి కూడా అవకాశం లేకుండా దెబ్బేసే తెలంగాణ అధికారపక్షానికి.. పాలనాపరమైన నిర్ణయాలకు సంబంధించి కోర్టు నుంచి ఎదురుదెబ్బలు తగలటం మాత్రం ఆగటం లేదు.

        తీవ్రమైన నిర్ణయం తీసుకున్న ప్రతిసారి కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగలటం తెలంగాణ సర్కారుకు ఒక అలవాటుగా మారిపోయింది. ఏడాది కాలంలో హైకోర్టు ఉంచి ఎన్నో విషయాలకు సంబంధించి ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న కేసీఆర్‌ సర్కారుకు తాజాగా.. తెలంగాణ జెన్‌కోలో స్థానికత ఆధారంగా చేసిన 1100 బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోవటం కేసీఆర్‌ సర్కారు వంతైంది.

        ఆంధ్రా స్థానికత ఉండి తెలంగాణ జెన్‌కో ట్రాన్స్‌కోలో పని చేస్తున్న 1100 మంది ఉద్యోగుల్ని ఏపీకి కేటాయిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. తమను ఏపీకి కేటాయించటం సరికాదని.. ఆప్షన్లు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొంటూ సర్కారు నిర్ణయంపై విద్యుత్తు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన కోర్టు ప్రస్తుతం బదిలీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.

        అయితే.. తాము తీసుకున్న నిర్ణయం విభజన చట్టానికి అనుగుణంగా తీసుకున్నామే కానీ.. ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకోలేదని తెలంగాణ సర్కారు కోర్టుకు తెలిపింది. మరోసారి ప్రభుత్వ వాదనను కోర్టుకు వినిపిస్తామని పేర్కొంది.

        మరోవైపు.. ఈ అంశంపై విద్యుత్తు ఉద్యోగులు స్పందిస్తూ.. తమ బదిలీలకు సంబంధించి షీలాబేడి కమిటీ కొన్ని మార్గదర్శకాల్ని రూపొందించిందని..దానికి భిన్నంగా కేసీఆర్‌ సర్కారు నిర్ణయం తీసుకోవటం సరికాదంటున్నారు. కోర్టు ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ సర్కారుకు పాలనపరమైన నిర్ణయానికి సంబంధించి మరో ఎదురు దెబ్బ తగిలిందన్న భావన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News