సాదాబైనామాల క్రమబద్దీకరణపై స్టే ఇచ్చిన హైకోర్టు !

Update: 2020-11-11 16:30 GMT
సాదా బైనామాల పరిశీలనపై తెలంగాణ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సాదా బైనామాల క్రమబద్దీకరణపై బుధవారం హైకోర్టు లో విచారణ జరగగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందిన సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికంటే ముందు వచ్చిన దరఖాస్తులను పరిశీలించవచ్చని ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కొత్త రెవెన్యూ చట్టం అక్టోబర్ 29వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 2 లక్షల 26 వేల 693 దరఖాస్తులు వచ్చాయని, ఆ తర్వాత అంటే అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ పదో తేదీ వరకు 6 లక్షల 74 వేల 201 దరఖాస్తులు వచ్చాయని ఏజీ కోర్టుకు తెలిపారు. అయితే, రద్దయిన చట్టం ప్రకారం క్రమబద్ధీకరణ ఎలా చేస్తారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోరగా.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అక్టోబర్ 29వ తేదీ తర్వాత దాఖలైన 6,74,201 దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 29 కంటే ముందు దాఖలైన 2,26,693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు ఆదేశించింది.
Tags:    

Similar News