అమరావతిపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సమన్లు?

Update: 2022-05-05 11:30 GMT
అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇదివరకే ఇచ్చింది. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని ఆదేశించింది. అయితే  రాష్ట్ర ప్రభుత్వం సమస్యనుంచి తప్పించుకుంటోంది. హైకోర్టు ఉత్తర్వులను ఇప్పటికీ అమలు చేయలేదు.

మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న జగన్.. అమరావతిని మాత్రం ఏకైక రాజధానిగా ఒప్పించలేదు. మూడు రాజధానులపై సీఎం జగన్ ఇంకా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమరావతిని రాజధానిగా హైకోర్టు ఆదేశించినా.. వైసీపీ ప్రభుత్వం అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో తాజాగా పిటిషన్‌ వేశారు.

ఆర్థిక వనరులు లేవని పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని రైతులు ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు అమరావతి స్థితిగతులపై నివేదిక పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది.

'మూడు రాజధానుల'పై నిరసన తెలిపిన అమరావతి రైతులకు అనుకూలంగా మార్చి మొదటి వారంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.అమరావతిని రాజధాని నగరంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టరాదని హైకోర్టు తీర్పునిచ్చింది. 33 వేల ఎకరాలను రైతులు వదులుకున్నారని తెలిపింది. వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిన క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ) చట్టాన్ని కూడా కోర్టు కొట్టివేసింది.

హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. ప్రస్తుత కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది.

నివేదికను సిద్ధం చేసి సమర్పించడానికి వైసీపీ ప్రభుత్వానికి దాదాపు రెండు నెలల సమయం ఉంది. జగన్ ప్రభుత్వం నివేదిక అందజేస్తుందా? లేదా దీనిపై సుప్రీంకోర్టుకు వెళుతుందా చూడాలి.ఇదిలావుంటే అమరావతి రైతులకు ఈ నివేదిక కీలకం కానుంది.
Tags:    

Similar News