చంద్రబాబుకు ఈ అక్షింతలు సరిపోతాయా?

Update: 2016-08-24 04:28 GMT
స్విస్‌ చాలెంజ్‌ రూపంలో అమరావతి నగరంలో నిర్మాణ బాధ్యతలను తాను తలచుకున్న సింగపూర్‌ కంపెనీలకు అడ్డగోలు మార్గాల్లో కట్టబెట్టేయడానికి చంద్రబాబునాయుడు చేస్తున్న వక్ర ప్రయత్నాలను హైకోర్టు ఎండగట్టింది. స్విస్‌ ఛాలెంజ్‌ అనే పేరు పెట్టి.. అసలు టెండర్లు లేకుండా - రహస్యకార్యకలాపాలు సాగిస్తున్న తరహాలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు అభ్యంతరం పెట్టింది. దీనకంటె టెండరు విధానమే మేలంటూ ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఏపీ ప్రభుత్వ న్యాయవాది కౌంటరు దాఖలు చేయడానికి పదే పదే గడువు అడిగినా కూడా ఇవ్వకుండా వెంటనే కౌంటర్‌ వేయాలంటూ ఆదేశించడం విశేషం. అయినా చంద్రబాబు ఆలోచన సరళిలో మార్పు రావడానికి, ప్రజల పట్ల తాను చేస్తున్న వంచన ను ప్రపంచం గుర్తిస్తున్నదని ఆయన తెలుసుకోవడానికి ఈ మాత్రం కోర్టు అక్షింతలు సరిపోతాయా లేదా అని ఇప్పుడు ప్రజలు అంచనా వేస్తున్నారు.

అమరావతి నిర్మాణ బాధ్యతలను కొన్ని కంపెనీలకు కట్టబెట్టేయడానికి చంద్రబాబునాయుడు ఫిక్సయిపోయారు. ఆ కంపెనీలు తప్ప మరెవ్వరూ కోట్‌ చేయలేని విధంగా నిబంధనలను రూపొందించి బిడ్‌ లు ఆహ్వానించారు. స్విస్‌ చాలెంజ్‌ పద్ధతి ఉంటుందని ప్రకటించారు. అయితే పనులు - వాటాలు పంచుకోవడానికి సంబంధించిన అసలు విషయాలను మాత్రం ఆయన దాచిపెట్టారు. రెవిన్యూ పంపకాలు ఎలా ఉంటాయో మర్మం ముడి విప్పనేలేదు. దీంతో ఓ నిర్మాణ కంపెనీ హైకోర్టును ఆశ్రయించడంతో అసలు స్విస్‌ విధానంమీదనే న్యాయపీఠం అక్షింతలు వేసింది.

అయితే చంద్రబాబునాయుడుకు ఈ అక్షింతలు సరిపోతాయా లేదా.. తాను ఎవ్వరి మాటా వినే రకం కాదని నిరూపించుకుంటూ తాను తలచుకున్నది తాను చేసుకుపోతారా అనేది వేచిచూడాలి. మంత్రివర్గ సమావేశంలో స్విస్‌ఛాలెంజ్‌ గురించి వివరించినప్పుడు, కొందరు మంత్రులు ఆ కంపెనీల గురించి సందేహాలు వ్యక్తం చేస్తేనే, ''అంతకంటె బాగా ఎవరు కడతారు.. మీకేం తెలియదు.. అంతే'' అంటూ దబాయించి ముగించిన చంద్రబాబునాయుడు.. కోర్టు అభ్యంతరాలను ఖాతరు చేస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News