కబ్జాలపై విచారణ: హైదరాబాద్ పై కోర్టు మనసు కరిగింది..

Update: 2020-02-29 08:00 GMT
పేదలు ఖాళీ స్థలాల్లో ఇల్లు, గుడిసెలు నిర్మించుకుంటే ఆగమేఘాల మీద వచ్చేసి కూల్చే దాక నిద్రపోని అధికారులు పెద్దపెద్ద నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోరు. అక్రమంగా నిర్మాణాలు, కబ్జాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వ స్థలాలతో పాటు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో తీవ్రంగా చర్చనీయాంశమైంది. వాటితోపాటు అక్రమ నిర్మాణాలపై హైకోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే తాము రంగంలోకి దిగుతామని హెచ్చరించింది.

జీహెచ్‌ఎంసీ పరిధి లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని అత్యున్నత కోర్టు గుర్తుచేసింది. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు ఇలా కొనసాగితే అందమైన భాగ్యనగరం ముంబై, పట్నా మాదిరిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలను మీరు ఆహ్వానిస్తున్నా.. భాగ్య నగరం అలా మారితే నా మనసు గాయపడుతుంది ఈ సందర్భం గా చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయని, చర్యలకు ఆదేశించాలని కోరుతూ నగరానికి చెందిన ఇద్దరు పౌరులు పిటీషన్ దాఖలు చేయడంతో ధర్మాసనం వాటిని స్వీకరించి విచారించింది. అక్రమ నిర్మాణాలపై అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైకోర్టులో దాఖలైన కేసుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశించింది. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పార్కులు ఆక్రమించి ఎడాపెడా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఆక్రమణలను నిలువరించడానికి జీహెచ్‌ఎంసీలో ఎలాంటి విభాగం లేనట్లుందని పేర్కొంది. ఏం చర్యలు తీసుకున్నారో వివరించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మార్చి 24వ తేదీన జరిగే విచారణకు వారు హాజరుకావాలని కోరింది.

కబ్జాలు, ఆక్రమణలు ఇలాగే కొనసాగితే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సాగనంపాలని ఆదేశించింది. దీనిలో భాగంగా ముందుగా అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లను సస్పెండ్‌ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సిబ్బంది కళ్లు మూసుకోరాదని తెలిపింది. జీతాభత్యాలు చెల్లించేది నిద్రపోవడానికి కాదు.. అధికారులు చట్టాలు అమలు చేయాలని పేర్కొంది. అక్రమ నిర్మాణాలు క్రమబద్ధీకరించేందుకు ఐదేళ్లకోసారి తన విధానాలను సవరిస్తూ తీసుకునే నిర్ణయాలు సరికావని ధర్మాసనం తెలిపింది. ఇలాంటి జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు, పిల్స్‌ కోర్టుముందు ఇంకా పెండింగ్‌ లో ఉన్నాయని ధర్మాసనం గుర్తుచేసింది.

ఇటీవల తాను నల్సార్‌కు వెళ్లిన సమయంలో శామీర్‌పేట సరస్సులో పుట్టగొడుగుల్లా వెలిసిన నిర్మాణాలను గమనించానని చీఫ్ జస్టిస్ తెలిపారు. ఇదే తీరు కొనసాగితే శామీర్‌పేట సరస్సు మన జ్ఞాపకాల్లో మిగిలిపోవడానికి ఎంతోకాలం పట్టదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ చెరువును పూడ్చేయడానికి వేచి చూస్తున్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పరివాహక ప్రాంతాలను కాంక్రీట్‌ జంగిల్‌ గా మార్చి మన చెరువులు, సరస్సులను మనమే నాశనం చేసుకుంటామా?అని సీజే ప్రశ్నించారు. సర్కారు భూములతోపాటు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉందని గుర్తు చేసింది.

దీనిపై మీ విధులు మీరు నిర్వర్తించక పోతే తామే వాటిని చేపడుతుందని పేర్కొంది. విచారణ పూర్తి చేసి ఆదేశాలు ఇస్తామని తెలిపింది. అక్రమ కట్టడాలపై వచ్చే అన్ని ఫిర్యాదులను పరిశీలించి వాటిని అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారో తదుపరి విచారణ రోజున చెప్పాలని ధర్మాసనం కోరింది.


Tags:    

Similar News