హై స్పీడు రైలు .. కాస్త లేటు అంతే ఫ్రెండు !

Update: 2022-05-17 03:29 GMT
ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్నాడు ఆరుద్ర ! ఆ విధంగా ఏపీకి కూడా హై స్పీడు రైలు రావ‌డం ఓ  జీవిత కాలం లేటు కావొచ్చు. దీనికి కారణం... మన నాయకులే అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఏటా బ‌డ్జెట్ కేటాయింపుల్లో ద‌క్షిణాదికి ద‌క్కే ద‌క్షిణ ఎంతో తెలుసు క‌నుక వీటి గురించి మాట్లాడడం అన‌వ‌స‌రం అనేవాళ్లున్నారు.   

ముఖ్యంగా విజ‌య‌వాడ టు చెన్నై కు సంబంధించి ప్ర‌యాణ కాలాన్ని త‌గ్గించేందుకు ఎప్ప‌టి నుంచో  హై  స్పీడ్ రైలు ఒక‌టి ఉంటే బాగుండు అన్న ప్ర‌తిపాద‌న ఎప్ప‌టి నుంచో ఉంది.ఇప్పుడున్న ప్ర‌యాణ కాలం ఏడు నుంచి ఎనిమిది గంట‌లు అయితే అప్పుడు కేవ‌లం రెండు గంట‌ల్లోనే హాయిగా విజ‌య‌వాడ నుంచి చెన్నైకు చేరుకోవ‌చ్చు.

అదేవిధంగా విజ‌య‌వాడ నుంచి రాయ‌లసీమ మీదుగా బెంగ‌ళూరు కు కూడా ఓ హై స్పీడు రైలు న‌డ‌పాల‌న్న రైలు ప్ర‌తిపాద‌న ఉంది కానీ అది కూడా ప‌ట్టాలెక్క‌డం లేదు. ప్ర‌యాణానికి 12 నుంచి 14 గంట‌లు ప‌డుతుంది. హై  స్పీడ్ రైలుకు అయితే మూడు నుంచి నాలుగు గంట‌ల కాల‌మే ప‌డుతుంది.

 అదేవిధంగా విజ‌య‌వాడ నుంచి సికింద్రాబాద్ కు కూడా హై స్పీడ్ రైలు న‌డిపితే ప్ర‌యాణ కాలం ఐదు నుంచి ఆరు గంట‌ల కాలం బ‌దులు గంట 15 నిమిషాలు ప‌డుతుంది. ఇదే విధంగా విజ‌య‌వాడ నుంచి విశాఖకు హై స్పీడు రైలు న‌డిపినా ఇప్ప‌టి స‌మ‌యం క‌న్నా చాలా అంటే చాలా కాలం క‌లిసి వ‌స్తుంది. ఇప్పుడు ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణానికి ఐదు నుంచి ఆరు గంట‌ల కాలం ప‌డితే, అదే హై స్సీడు రైలు  న‌డిపితే  గంట‌న్న‌ర‌లో చేరుకోవ‌చ్చు.
 
వాస్త‌వానికి ప్ర‌ధాన న‌గరాల అన్నింటి మ‌ధ్యా ఈ స‌ర్వీసులు న‌డ‌ప‌వ‌చ్చు.  అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు కేంద్రం ద‌గ్గ‌ర ఉన్నాయి కానీ రాష్ట్ర ప్ఱ‌భుత్వ ఆర్థిక భాగ‌స్వామ్యం కూడా కీల‌కం.

అయితే ఇప్ప‌టిదాకా ప్ర‌తిపాదిత ప్రాజెక్టుల‌కే రాష్ట్ర  ప్ర‌భుత్వం తన‌వంతు వాటాగా చెల్లించాల్సిన మొత్తాల‌ను చెల్లించ‌కుండా ఉంటోంది. అందుకే చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి అని వాస్త‌వాధార క‌థ‌నాలు వెల్ల‌డి చేస్తున్నాయి. క‌నుక రెండు ప్ర‌భుత్వాలూ స‌మ‌న్వ‌యంతో స‌మ‌స్య‌కు ఓ ప‌రిష్కారం యోచించాలి.

ద‌క్షిణాదిన న‌డిచే రైళ్లు ఆదాయం ప‌రంగా బాగానే ఉన్నా, బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఎప్పుడూ కేంద్రం వివ‌క్ష చూపిస్తూనే ఉంది. అందుకే ఏ న‌యా ప్రాజెక్టూమోక్షం ద‌క్కించుకోవ‌డం లేదు. తాజాగా కొన్ని ప్ర‌తిపాద‌న‌లు అధికారులు పంపితే కేంద్రం ఏమంటుందో  ఏ విధంగా స్పందిస్తుందో చూడాలిక.
Tags:    

Similar News