సెంట్ర‌ల్ వ‌ర్సిటీ తాళాలు బ‌ద్ధ‌ల‌య్యాయి!

Update: 2017-01-18 06:22 GMT
హైద‌రాబాదు సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో ఏడాది క్రితం రాజుకున్న చిచ్చు ఇంకా ఆర‌లేద‌నే సంకేతాలు స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. అగ్ర‌వ‌ర్ణాల వివ‌క్ష‌కు గుర‌య్యానంటూ తీర‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన ద‌ళిత విద్యార్థి రోహిత్ వేముల వ‌ర్సిటీలోని త‌న హాస్ట‌ల్ గ‌దిలోనే ఏడాది క్రితం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. రీసెర్చి స్కాల‌ర్‌ గా ఉన్న రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య ఒక్క హైద‌రాబాదులోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా పెను సంచ‌ల‌నానికే తెర తీసింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ - ప‌లువురు జాతీయ స్థాయి రాజ‌కీయ నేత‌లు హెచ్‌ సీయూలో వాలిపోయిన వైనం మ‌నంద‌రం ఎప్ప‌టికీ మ‌రువ‌లేమ‌నే చెప్పాలి. రోజుల త‌ర‌బ‌డి విద్యార్థులు రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాల‌ని, అత‌డి ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులైన వారిని త‌క్ష‌ణ‌మే క‌ఠినంగా శిక్షించాల‌ని కూడా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. అయితే ఆ ఆందోళ‌న‌లు క్ర‌మంగా త‌గ్గిపోగా.. ప్ర‌స్తుతం వ‌ర్సిటీలో ప్ర‌శాంత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

నిన్న రోహిత్ వేముల వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని విద్యార్థులు నిర్వ‌హించిన నివాళి కార్య‌క్ర‌మంలో మళ్లీ వ‌ర్సిటీలో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కే దారి తీసింది. పెద్ద సంఖ్య‌లో పోగైన విద్యార్థులు వ‌ర్సిటీలోనే రోహిత్ వేముల వ‌ర్ధంతిని నిర్వ‌హిస్తామ‌ని ముందుకు వ‌చ్చాయి. విద్యార్థుల‌తో పాటు రోహిత్ త‌ల్లి రాధిక కూడా అక్క‌డికి వ‌చ్చారు. అయితే విద్యార్థుల‌నే కాకుండా రోహిత్ వేముల త‌ల్లిని కూడా పోలీసులు లోప‌లికి అనుమ‌తించ‌లేదు. వ‌ర్సిటీలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ మాట చెప్పిన పోలీసులు... వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలో రోహిత్ వ‌ర్దంతికి అనుమ‌తిచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డికి చేరుకున్న వంద‌లాది మంది విద్యార్థులు వ‌ర్సిటీ గేట్ల‌ను దూకేశారు. గేట్లకు వేసిన తాళాల‌ను ప‌గుల‌గొట్టేశారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితి ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. అంత‌టితో ఆగ‌ని విద్యార్థులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్య‌తిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

హుటాహుటిన అక్క‌డ‌కు చేరుకున్న మ‌రిన్ని పోలీసు బ‌ల‌గాలు... ఎలాగోలా విద్యార్థుల ఆందోళ‌న‌కు చెక్ పెట్టేసి... వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌ కు త‌ర‌లించారు. అక్క‌డితో ప‌రిస్థితి కాస్తంత శాంతించినా... ఇప్ప‌టికీ వ‌ర్సిటీలో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణ‌మే కొన‌సాగుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. నిన్న‌టి ఉద్రిక్త ప‌రిస్థితులే ఈ వాద‌న‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వ‌ర్సిటీ అధికారులు - పోలీసులు ఏమాత్రం ఆద‌మ‌ర‌చినా... మ‌రోమారు వ‌ర్సిటీలో ఆందోళ‌న‌ల‌కు దిగేందుకు విద్యార్థులు ఎల్ల‌ప్పుడూ సిద్ధంగానే ఉన్నారన్న విష‌యం కూడా నిన్న‌టి ఘ‌ట‌న‌తో తేట‌తెల్ల‌మైన‌ట్లుగానే క‌నిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News