అరవొద్దని హరీశ్ సైగ చేస్తే.. తల కిందకు వంచి సిగ్నల్ ఇచ్చిన కేటీఆర్

Update: 2019-09-08 11:35 GMT
అనుకున్న సమయం రానే వచ్చింది. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని తెర మీదకు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. చెప్పినట్లే ఈ సాయంత్రం (ఆదివారం) నాలుగు గంటల వేళలో ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఆరుగురు ప్రమాణస్వీకారం చేస్తారా?  తొమ్మిది మంది చేస్తారా? అన్న చర్చలకు పుల్ స్టాప్ పెడుతూ.. ఆరుగురికే అవకాశం ఇచ్చారు కేసీఆర్. కేబినెట్ నుంచి ముగ్గరు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న సంకేతాలకు భిన్నంగా.. అలాంటిదేమీ లేకుండా చేసిన ఆయన.. ప్రస్తుతానికి పూర్తిస్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేశారని చెప్పాలి.

ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎవరూ ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. బావ.. బావమరుదులైన హరీశ్.. కేటీఆర్ లు ఒకే కారులో రాజ్ భవన్ కు రావటంతో అందరి చూపులు వారిపైనే పడ్డాయి. ఇక.. ప్రమాణస్వీకారోత్సవంలో ఎవరిని మొదట పిలుస్తారన్న అంశంపై ఉత్కంటతో చూశారు.   కొందరు అంచనా వేసినట్లే మేనల్లుడు హరీశ్ ను మొదట పిలవటం ద్వారా.. ఆయనకు తానిచ్చే ప్రాధాన్యత ఏమిటన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు. తొలుత ప్రమాణస్వీకారం చేసిన హరీశ్.. వేదిక మీదకు వచ్చి.. ప్రమాణస్వీకారోత్సవం పాఠాన్ని చదివే ముందు.. నోటితో వేలును పెట్టి.. ఎవరూ అనవసరంగా నినాదాలు చేయకూడదన్న సంకేతాన్ని ఇచ్చేశారు.

ఇప్పటివరకూ హరీశ్ కు మంత్రి పదవి ఇవ్వలేదన్న వేదన ఆయన అభిమానుల్లో ఉండేది. కాస్త ఆలస్యంగా అయినా.. హరీశ్ కు పదవి ఇవ్వటం.. ప్రాధాన్యం ఇచ్చి.. ఆయన్ను అభిమానించే వారిలో ఆనందాన్ని నింపారు కేసీఆర్. ప్రమాణస్వీకారం సందర్భంగా ఎలాంటి తడబాటు లేకుండా ప్రమాణాన్ని పూర్తి చేసిన హరీశ్.. అనంతరం కేసీఆర్ వద్దకు వచ్చి నమస్కారంతో పాటు.. పాదాభివందాన్ని చేయటం ద్వారా మేనమామ మీద తనకున్న విధేయతను ప్రదర్శించుకున్నారు.

ఆ తర్వాత ప్రమాణస్వీకారం చేసిన కేటీఆర్ సైతం తాను ఇవ్వాల్సిన సంకేతాన్ని ఇవ్వటం కనిపించింది. ప్రమాణస్వీకారం చేయటానికి వేదిక మీదకు వచ్చిన ఆయన.. తలను కిందకు వంచి.. అరుపులు వద్దన్న రీతిలో సంకేతాలు ఇచ్చి ప్రమాణస్వీకార పాఠాన్ని తెలుగులో చదివారు. ఆయన సైతం ఎక్కడా.. ఎలాంటి తడబాటుకు గురి కాలేదు. ప్రమాణస్వీకారం అయ్యాక.. ముఖ్యమంత్రి కమ్ తన తండ్రి కేటీఆర్ కాళ్లకు నమస్కారం చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే..మేనల్లుడు హరీశ్ కాళ్లకు దండం పెట్టే సమయంలో కాస్తంత వారించిన కేసీఆర్.. కేటీఆర్ పాదాభివందనం చేసినప్పుడు మాత్రం తండ్రి స్థానంలో ఉన్నట్లుగా వ్యవహరించి.. ఊరుకోవటం కనిపించింది. వీరిద్దరి తర్వాత సబితా.. గంగుల.. సత్యవతి.. పువ్వాడ అజయ్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. పువ్వాడ ప్రమాణస్వీకారం చేసినప్పుడు పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులంతా గవర్నర్ తమిళిసై వద్దకు వెళ్లి నమస్కారం చేశారు. పలువురు మంత్రులు తన వద్దకు వచ్చి నమస్కారం చేసినంతనే.. గవర్నర్ కు నమస్కారం చేయాల్సిందిగా కేసీఆర్ చెప్పటం కనిపించింది.
Tags:    

Similar News