ఆ ఇద్దరు ఆడోళ్లు ట్రంప్ ను దుమ్మెత్తి పోశారు

Update: 2016-06-04 13:29 GMT
కంపు నోటితో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయే ట్రంప్ యవ్వారాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడిగా ఎలాంటి నేత ఉండకూడదని ఎవరైనా అడిగితే.. చటుక్కున చూపించే నేతే డోనాల్డ్ ట్రంప్. రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్న అతగాడి తీరును తాజాగా అమెరికాకు చెందిన ఇద్దరు మహిళలు దుమ్మెత్తిపోయటం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు ఆడోళ్లలో రాజకీయ నేతగా.. ఘాటైన విమర్శలు చేసే అలవాటున్న హిల్లరీ ఒకరైతే.. ఎప్పుడూ హుందాగా వ్యవహరిస్తూ.. నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చే ఒబామా సతీమణి మిషెల్లీ ఒకరు కావటం గమనార్హం.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి రాజకీయ విమర్శల్ని చేసినట్లుగా మిషెల్లీ ఎక్కడా కనిపించదు. అలాంటి ఆమె సైతం ట్రంప్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. డెమొక్రాటిక్ తరఫున ఈ ఇద్దరు మహిళలు ఒకేసారి వేర్వేరు చోట్ల ట్రంప్ మీద మండిపడటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. తమ ప్రసంగాల్లో ట్రంప్ వైఖరిని.. విధానాల్ని తీవ్రంగా తప్పుపట్టారు. హిల్లరీ అయితే ఒక అడుగు ముందుకేసి.. ట్రంప్ కాని అమెరికా అధ్యక్షుడైతే నియంత అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అమెరికాలోని వలసదారుల్ని అవమానించటం తప్పించి.. ట్రంప్ మరింకేమీ మాట్లాడలేదన్నారు. మరోవైపు.. ఒబామా సతీమణి మిషెల్లీ మాట్లాడుతూ.. వలసదారుల్ని అడ్డుకునేందుకు సరిహద్దుల్లో గోడలు కడతానని ట్రంప్ అన్నారని.. ఇదేమాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల్లో జన్మించి అమెరికాలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న ఎంతోమంది అమెరికాను ప్రపంచంలో గొప్పదేశంగా నిలబెట్టేందుకు విపరీతంగా శ్రమించిన విషయాన్ని గుర్తు చేశారు. మరి తనపై తీవ్రంగా విరుచుకుపడ్డ ఈ ఇద్దరి ఆడాళ్ల  మీద ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
Tags:    

Similar News