శ్రీమంతుడులో మహేష్‌ గా కేటీఆర్‌ కొడుకు హిమాన్షు!

Update: 2023-07-11 10:10 GMT
తెలంగాణ సిఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు తన పెద్ద మనసు చాటుకున్నాడు! ఇందులో భాగంగా... ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నారు. దీంతో సుమారు రూ.కోటి వెచ్చించి కార్పొరేట్‌ స్కూల్ తరహాలో తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశాడు.

అవును... సౌకర్యాల లేమితో సతమతం అవుతున్న ప్రభుత్వ పాఠశాలకు తెలంగాణ ముఖ్యమంత్రి మనుమడు హిమాన్షు చొరవతో సదుపాయాలు సమకూరాయి. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో సౌకర్యాలు కల్పించారు. తాను చదివే పాఠశాలలో నిధులు సేకరించి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందించాడు. ఫలితంగా కేశవనగర్‌ ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ వచ్చింది.

కేటీఆర్‌ తనయుడు హిమాన్షు ఖాజాగూడ ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లో చదువుతున్నాడు. చదువుతో పాటు కమ్యూనిటీ యాక్షన్‌ సర్వీస్‌‌ (సీఏఎస్) లో కూడా హిమాన్షు చురుగ్గా పాల్గొనేవాడట. ఇందులో భాగంగా... సహచర విద్యార్థులతో కలిసి గౌలిదొడ్డి కేశవనగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధించేందుకు ప్రతి శనివారం వెళ్లేవారట.

ఈ నేపథ్యంలో గత ఏడాది తమ పాఠశాల కమ్యూనిటీ యాక్షన్ సర్వీస్ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన హిమాన్షు... అక్కడి సమస్యలను చూసి వసతులు కల్పించాలని భావించాడట. ఇదే సమయంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్‌ ను సంప్రదించి పాఠశాల అవసరాలను గుర్తించాడట.

దీంతో, పాఠశాలను దత్తత తీసుకున్నాడు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దాడు. ఈ విషయాలను ఆ స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌  వెల్లడించారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తాజాగా దీనికి సంబంధించిన వివరాలను హిమాన్షు తన ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇదిలా ఉండగా.. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించనున్నారు.

Similar News