హిందూపురంలో బాల‌కృష్ణ‌కు నిర‌స‌న సెగ‌!

Update: 2020-01-30 08:30 GMT
వెళ్ల‌క వెళ్ల‌క హిందూపురానికి వెళ్లిన తెలుగుదేశం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ కు అక్క‌డ నిర‌స‌న ఎదుర‌యిన‌ట్టుగా తెలుస్తోంది. మూడు రాజ‌ధానుల ఫార్ములా కు తెలుగుదేశం పార్టీ వ్య‌తిరేకం అనే సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో అటు ఉత్త‌రాంధ్ర‌లో, ఇటు రాయ‌ల‌సీమ‌లో తెలుగుదేశం పార్టీ తీరు ప‌ట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతూ ఉంది. రాయ‌ల‌సీమ‌ లో హై కోర్టు కాంక్ష మొద‌టి నుంచి బ‌లంగా ఉంది. ఉత్త‌రాంధ్ర‌లోనూ ఇప్పుడు స్థానిక సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యం లో కూడా తెలుగుదేశం పార్టీ మాత్రం అంతా అమ‌రావ‌తే అని అంటోంది. అమ‌రావ‌తి నుంచినే స‌ర్వం సాగాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తూ ఉంది.

ఈ మేర‌కు వికేంద్రీక‌ర‌ణ బిల్లును తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ద్వారా అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. మండ‌లిలో ఆ బిల్లును అడ్డుకుని మండ‌లి ర‌ద్దుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధం అయ్యింది. ఏదేమైనా త‌మ‌కు అమ‌రావ‌తే ముఖ్య‌మ‌ని తెలుగుదేశం పార్టీ తేల్చింది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో తెలుగుదేశం నేత‌లు జ‌నం మ‌ధ్య‌కు వస్తే నిర‌స‌న గ‌ళం వినిపస్తూ ఉంది.

ఈ నేప‌థ్యంలో హిందూపురం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన బాల‌కృష్ణ‌కు అక్క‌డ స్థానికులు నిర‌స‌న తెలిపిన‌ట్టుగా తెలుస్తోంది. హిందూపురంలో బాల‌య్య తీరుపై ఇలాంటి నిర‌స‌న‌లు కొత్త కాదు. గ‌తంలో నీటి కొర‌త విష‌యంలోనూ బాల‌కృష్ణ‌పై స్థానికులు మండి ప‌డ్డారు. అయినా బాల‌కృష్ణ ఎన్నిక‌ల్లో నెగ్గాడంటే అక్క‌డ వైసీపీ కి స‌రైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డ‌మే కార‌ణం. ఎక్కువ‌మంది నేత‌లు అక్క‌డ వైసీపీ టికెట్ ఆశించి.. పార్టీ ఓటమికి కార‌ణం అయ్యారు. బాల‌కృష్ణ‌ ను మ‌ళ్లీ గెలిపించారు!

ఇక ఈ మ‌ధ్య‌కాలంలో కూడా బాల‌కృష్ణ అరుదుగా మాత్ర‌మే హిందూపురం వైపు వెళ్తున్నారు. సినిమా షూటింగులు లేక‌పోవ‌డంలో ఆయ‌న హిందూపురం వెళ్లిన‌ట్టుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మూడు రాజ‌ధానుల విష‌యంలో స్థానికుల నుంచి నిర‌స‌న ఎదురైన‌ట్టుగా ఉంది. ఈ నిర‌స‌న‌కు కౌంట‌ర్ గా తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు కూడా రెచ్చిపోయిన‌ట్టుగా తెలుస్తోంది.


Tags:    

Similar News