కరోనాతో అతని ఆరు నెలల పోరు.. రూ.50 లక్షల రివార్డు!

Update: 2022-01-28 08:37 GMT
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఫ్రంట్ లైన్ వర్కర్ల పాత్ర ఎనలేనిది. వైరస్ అనగానే అయినవారి నుంచి ఆమడ దూరంలో పరుగెత్తిన సమయంలోనూ వారు నిస్వార్థ సేవలు అందించారు. ఇల్లు, పిల్లలు, కుటుంబాలకు దూరంగా ఉంటూ అమూల్యమైన సేవలు చేశారు. ఈ పోరులో వారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ యుద్ధంలో ఎంతో మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు అసువులు బాసారు. చాలా మంది మహమ్మారి బారిన పడి అనారోగ్యం పాలయ్యారు. ఓ ఫ్రంట్ లైన్ వర్కర్ ఏకంగా ఆరు నెలల పాటు మహమ్మారితో పోరాటం చేశారు. చివరకు వైరస్ పై గెలిచారు.

యుఏఈలో ఓ ఆస్పత్రిలో పనిచేసే భారతీయుడు కరోనా బారిన పడ్డారు. ఫ్రంట్ లైన్ వర్కర్ గా సేవలందించారు. ఆ సమయంలో విధులు నిర్వర్తిస్తుండగా మహమ్మారి సోకింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు నెలల పాటు హింసించింది. అర్ధ సంవత్సరం కాలం వైరస్ పై పోరాడారు. ఆరు నెలల కాలంలో వైరస్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు వైరస్ ఫ్రీ అయ్యారు. కొవిడ్ విముక్తి పొందారు. అందుకు గాను అక్కడి ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. ఏమాత్రం అధైర్య పడకుండా ఆరు నెలల పాటు పోరాడినందుకు గాను రూ.50 లక్షల రివార్డు ఇచ్చింది.

కేరళకు చెందిన అరుణ్ కుమార్ అరబ్ దేశంలో అబుదాబిలోని ఓ ఆస్పత్రిలో పనిచేసేవారు. వీపీఎస్ హెల్త్ కేర్ లో సాంకేతిక విభాగంలో విధులు నిర్వర్తించారు. కరోనా సమయంలోనూ సేవలందించారు. ఎంతో మంది వైరస్ బాధితులను దగ్గర ఉండి చూసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా సోకింది. మహమ్మారి దాడితో కార్డియాక్ అరెస్ట్, ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు గట్రా అన్నీ ఏకమై దాడి చేశాయి. అనేక ఇతర సమస్యల బారిన పడ్డారు. ఇలా రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు.

దాదాపు ఆరు నెలల పాటు కరోనా ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయినా కూడా అరుణ్ కుమార్ ఏమాత్రం అధైర్య పడలేదు. మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు. నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఎట్టకేలకు వైద్యల ట్రీట్ మెంట్ కు ఆయన శరీరం స్పందించింది. వైరస్ ను ఎదుర్కొంది. చివరకు ఆరు నెలల తర్వాత వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అయితే విధి నిర్వహణలో భాగంగా కరోనా బారిన పడి... ఆపై ఆరు నెలల పాటు అనారోగ్యం పాలయ్యారు. చివరకు పూర్తి ఆరోగ్యవంతుడిగా బయటకు వచ్చారు. ఆయన పోరాట పటిమకు గుర్తుగా ఆక్కడి ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డు ప్రకటించింది.
Tags:    

Similar News