కర్ణాటక హైకోర్టు చేసిన చారిత్రక వ్యాఖ్య.. మైండ్ సెట్ మొత్తాన్ని మార్చేస్తుంది

Update: 2021-07-16 08:28 GMT
ఒక సున్నితమైన అంశంపై కర్ణాటక హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్య మైండ్ బ్లోయింగ్ గా మారింది. సమాజంలోని అన్ని వర్గాల మైండ్ సెట్ ను మార్చేలా తాజా వ్యాఖ్య ఉండటం గమనార్హం. తప్పులు చేసే పెద్దల పుణ్యమా అని.. ప్రపంచంలోకి వచ్చే పిల్లలు ఇంతకాలం ఎదుర్కొనే సూటిపోటీ మాటలకు సమాధానం చెప్పేలా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య ఉందని చెప్పాలి. ఇంతకీ అంతటి ఆసక్తిని రేకెత్తించే వ్యాఖ్య ఏమిటంటే..

''ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో. అక్రమ సంతానం మాత్రం ఉండదరు. ఎందుకంటే తమ పుట్టుకలో పిల్లల పాత్ర ఏమీ ఉండదు'' అని చేసిన వ్యాఖ్యను అందరూ స్వాగతించాల్సిందే. అక్రమ సంతానం అంటూ అదే పనిగా ముద్ర వేసి.. ఏళ్లకు ఏళ్లుగా తాము చేయని తప్పునకు తీవ్రంగా శిక్షను అనుభవిస్తున్న ఎందరికో ఓదార్పును ఇచ్చేలా.. సమాజం మైండ్ సెట్ మారేలా తాజా వ్యాఖ్య ఉందని చెప్పాలి. ఇంతకీ.. ఈ వ్యాఖ్య చేయటానికి కారణమేమిటి? ఆ కేసు ఏమిటన్న విషయంలోకి వెళితే..

బెస్కాం.. బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ. ఇందులో ఒక వ్యక్తి గ్రేడ్-2 లైన్ మన్ గా పని చేసేవాడు. అతడు 2014లో మరణించాడు. తన తండ్రి ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని మరణించిన వ్యక్తి రెండో భార్య కుమారుడు సంతోష కోరారు. అయితే.. రెండో భార్య సంతానానికి తండ్రి ఉద్యోగం ఇవ్వటం తమ విధానాలకు విరుద్ధమని బెస్కాం పేర్కొంది. సంతోషకు జాబ్ ఇవ్వటానికి నో అంటే నో చెప్పేసింది.

దీంతో.. సదరు వ్యక్తి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తొలుత హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సంతోష పిటిషన్ ను తిరస్కరిస్తూ తీర్పును ఇచ్చింది. అయితే.. ఆ తీర్పుపై అప్పీలుకు వెళ్లిన సంతోషకు ఊరట కలిగించేలా జస్టిస్ బి.వి. నాగరత్న.. జస్టిస్ సంజీవ్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్య చేయటంతో పాటు.. అంతకు ముందు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

తల్లి.. తండ్రి లేకుండా ఈ ప్రపంచంలో పిల్లలు ఎవరూ పుట్టరని.. తమ పుట్టుకలో వారి పాత్ర ఏమీ ఉండదని..కాబట్టి అక్రమ తల్లిదండ్రులు ఉంటారే కానీ అక్రమ పిల్లలు ఉండరనే వాస్తవాన్ని చట్టం గుర్తించాలన్నారు.  చట్టబద్ధమైన వివాహాలకు వెలుపల పుట్టే చిన్నారులకు ఎలా రక్షణ కల్పించాలన్న దానిపై పార్లమెంటు ఆలోచించాలన్న సూచనను ధర్మాసనం చేసింది.

అంతేకాదు.. సంతోషకు ఉద్యోగాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కూడా బెస్కాంను ఆదేశించింది. మరి.. కొత్త చరిత్రకు నాంది పలికేలా బెస్కాం నిర్ణయం తీసుకుంటుందా? మూస పద్దతిలో.. ఇప్పటివరకు అక్రమ సంతానం అంటూ మాటలు పడిన వారి జాబితాలోనే సంతోషను నిలుపుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. హైకోర్టు వ్యాఖ్యతో అయినా.. బెస్కాం తన మైండ్ సెట్ మార్చుకుంటే.. సమాజంలోనూ ఈ అంశంపై మార్పు రావటం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News