ఇళ్లపైన జాతీయజెండాలు ఎగురవేయండి: అసద్

Update: 2019-12-22 06:02 GMT
ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ లపై వినూత్న నిరసన తెలుపాలని ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతీ ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని.. మనమంతా దేశ పౌరులమనే విషయాన్ని చాటాలని అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో జరిగిన భారీ బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిన తర్వాత కూడా తాము భారతీయులమేనని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఎన్ఆర్సీ బిల్లు కల్పిస్తోందని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు.  దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందన్నారు. ఇది నా దేశం - నా దేశం కోసం ప్రాణాలను సైతం అర్పిస్తానని అసద్ ఉద్వేగంగా చెప్పారు.

బంగ్లాదేశ్ - పాకిస్తాన్ - అప్ఘనిస్తాన్ తో తనకు సంబంధం లేదని అసద్ అన్నారు. యూపీలో 16మంది మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 4శాతం మందికే పాస్ పోర్టు ఉందని.. మిగతా వారంతా ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సిన దుస్థితి 70 ఏళ్ల తర్వాత వచ్చిందన్నారు. ముస్లింల పేరు ఎన్ఆర్సీలో లేకపోతే అతడి కుటుంబం ఎక్కడికి వెళ్లాలని అసద్ ప్రశ్నించారు.

ఇప్పుడు దేశంలో గాంధీ లేరని.. ఆయన లౌకికత్వం ఉందని.. అంబేద్కర్ లేదని.. ఆయన అందించిన రాజ్యాంగం ఉందని అసద్ గుర్తు చేశారు. కేంద్రం నిర్ణయాలతో గాంధీ - అంబేద్కర్ - మౌలానా ఆజాద్ లను అవమానించినట్టేనని విమర్శించారు.

దేశంలోని హిందూ, ముస్లింలమధ్య బీజేపీ రెచ్చగొట్టి గొడవపెడుతోందని అసద్ ఆరోపించారు. సీఏఏపై హింసకు తావు లేకుండా నిరసన తెలుపాలన్నారు. ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలన్నారు.
    

Tags:    

Similar News