పుర ఎన్నికల పోలింగ్ కు సెలవు ఇస్తారా?

Update: 2020-01-17 04:15 GMT
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పుర ఎన్నికల హడావుడి మహా జోరుగా సాగుతోంది. మిగిలిన రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే.. హైదరాబాద్ మహానగర శివారులో పరిస్థితి మరోలా ఉంటుంది. విలక్షణంగా ఉండే ఓటరుతో పాటు.. ఇప్పుడు సాగుతున్న పుర ఎన్నికలు కాస్తంత భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ మహానగర శివారులో ఏడు కార్పొరేషన్లు.. ఏడు మున్సిపాల్టీలకు జరగనున్న పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది.

దీనికి కారణం లేకపోలేదు. ఎప్పుడూ లేనంతగా ఈసారి సెలవులు కలిసి రావటంతో పండక్కి మూడు రోజుల ముందే వెళ్లిన వారు.. పండగ తర్వాత కూడా మరో మూడు రోజులు ఊళ్లల్లో ఉండే ఛాన్స్ ఉండటంతో ఆ సదవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోని పరిస్థితి. దీంతో.. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లిన నగర జీవులు తక్కువలో తక్కువ అయితే ఆదివారం లేదంటే సోమవారానికి మాత్రమే హైదరాబాద్ కు చేరుకునే పరిస్థితి.

సెలవులన్ని పండుగ వేళ తీసుకుంటున్న వేళ.. బుధవారం జరిగే పోలింగ్ కు మరో సెలవు తీసుకునే ఛాన్స్ ఉండదు. అదే సమయంలో.. పుర ఎన్నికలకు సెలవు ఇచ్చినా హైదరాబాదీయులకు వర్క్ వుట్ కాని పరిస్థితి. ఎందుకంటే.. శివారులో నివాసం ఉంటే వారి ఆఫీసులు అత్యధిక భాగం హైదరాబాద్ మహానగర పరిధిలో ఉంటుంది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో సెలవు ఇస్తారే కానీ.. వారు పని చేసే ఆఫీసులు ఉన్న ప్రాంతాల్లో సెలవు ఇవ్వరు. దీంతో.. పోలింగ్ మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

ఒకవేళ పోలింగ్ వేళ ఓటు వేయాలని భావించినా.. సంక్రాంతి సందర్భంగా సెలవులు తీసుకున్న ఓటర్లు.. ఇప్పుడు ఓటు కోసం సెలవు పర్మిషన్ అని అడగలేని పరిస్థితి. ఇదే జరిగితే పోలింగ్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మామూలుగానే హైదరాబాదీయులు పోలింగ్ విషయంలో బద్ధకంగా ఉంటారన్న అపప్రధ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మరింత ఎక్కువగా పడే అవకాశం లేకపోలేదు. స్థానిక ఎన్నికలని లైట్ తీసుకోవటం లాంటివి చేస్తారన్నఆందోళన అభ్యర్థుల్లో ఉంది. మొత్తంగా చూస్తే పుర ఎన్నికల పోలింగ్ వేళ సెలవు ఇచ్చినా.. ఆఫీసుకు వెళ్లక తప్పనిపరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అదే జరిగితే.. పోలింగ్ మాటేమిటి? అన్న టెన్షన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను వెంటాడుతోంది.


Tags:    

Similar News