'మా బావే నా మొగుడు..' వద్దమ్మా శాపం అంటున్న సైంటిస్టులు!

దగ్గరి సంబంధం పెళ్లిళ్లు చేసుకుంటే పుట్టే పిల్లలకు జన్యువ్యాధులు వచ్చి జీవితం నరకప్రాయం అవుతుందని సూచిస్తున్నారు.

Update: 2025-03-02 11:30 GMT

‘‘ఏమేవ్.. కాలేజీలో ఎంతో మంది నీకు ప్రపోజ్ చేస్తున్నా..ఒక్కరికీ ఓ కే చెప్పడం లేదు. ఎందుకే నీకింత పొగరు.. ’’ అంటూ శామిలిని కాస్త కోపంగా మందలించింది శ్యామల. ‘‘నా వెంట ఎంత మంది పడినా.. నా మనస్సు మా బావకు చిన్నప్పుడే ఇచ్చేశానే..మా బావే నా మొగుడని అప్పుడే ఫిక్స్ అయ్యా..నేను పుట్టినప్పుడే మా మేనత్త కొడుకు శ్యాంసుందర్ కు ఇచ్చి పెళ్లి చేస్తామని నాకు శామిలి అని పేరుపెట్టారే..’’ అని సిగ్గుల మొగ్గ అయ్యింది శామిలి. ఇలా బావామరదళ్లు, మేనమామ, కోడళ్ల సరసాలు, పెళ్లిళ్లు మన దగ్గర సహజమే. తెలిసిన వాళ్లనే పెళ్లి చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అని ఎక్కువ మంది కుటుంబాలు, యువతీయువకులు అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి మేనరికపు పెళ్లిళ్లు వద్దుంటున్నా శాస్త్రవేత్తలు. మేనరికపు వివాహాలు పుట్టే పిల్లలకు శాపంగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు. దగ్గరి సంబంధం పెళ్లిళ్లు చేసుకుంటే పుట్టే పిల్లలకు జన్యువ్యాధులు వచ్చి జీవితం నరకప్రాయం అవుతుందని సూచిస్తున్నారు.

అరుదైన జన్యు వ్యాధులకు సంబంధించి 2021లో కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నిమ్స్ సహ దేశంలోని 12 ఆస్పత్రులను జన్యువ్యాధులకు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లుగా ఎంపిక చేసింది. జన్యువ్యాధులతో వచ్చే చిన్నారులకు హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ లో జన్యు పరీక్షలు నిర్వహించిన అనంతరం నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ కు జన్యువ్యాధులతో 2014లో 2,453 మంది వస్తే 2024లో ఆ సంఖ్య 12,042కు పెరిగింది. దీన్ని బట్టి అర్థం అయ్యేది మేనరికాల వల్ల జన్యువ్యాధులు పెరుగుతున్నాయని భావించవచ్చు.

జన్యువ్యాధుల్లో ప్రధానంగా గౌచర్, విల్సన్ వ్యాధులు, కొందరిలో తలసేమియా, సికిల్ సెట్ అనిమియా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. గౌచర్ వ్యాధిలో కొవ్వు విచ్ఛిన్నం చెందక ప్లీహం, కాలేయం వంటి అవయవాల్లో పేరుకుపోతుంది. దీంతో ఎముకలు బలహీనపడటంతో కీళ్ల వ్యాధులు దాడి చేస్తాయి. విల్సన్ వ్యాధి కాలేయంపై దాడి చేస్తుంది. కాపర్ నిల్వలు కాలేయంలో పేరుకుపోయి దాని పనితీరును దెబ్బతీస్తుంది. కొన్నాళ్లకు కాలేయ మార్పిడి చేయాల్సి వస్తుంది. దీనికి లక్షల ఖర్చు అవుతుందనే విషయం తెలిసిందే. కొన్ని సార్లు శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడే జన్యువ్యాధులు దాడి చేస్తున్నాయి. కొందరిలో పుట్టిన తర్వాత బయటపడుతున్నాయి. నిమ్స్ కు వచ్చే జన్యువ్యాధుల కేసుల్లో ఎక్కువ శాతం మేనరికాలు చేసుకున్న దంపతుల సంతానానివే కావడం గమనార్హం.

జన్యువ్యాధులు రాకుండా ఉండాలంటే మేనరికపు వివాహాలు వద్దనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒకే రక్త సంబంధీకుల మధ్య జరిగే వివాహాల్లో పేరెంట్స్ నుంచి పిల్లలకు, అలా తరతరాలకు డీఎన్ఏ వెళ్తుంది. జన్యువుల మ్యూటేషన్ తక్కువగా అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు శాస్త్రీయ ధోరణితో ఆలోచించి పిల్లలకు మేనరికం కాకుండా బయటి వారితో వివాహం జరిపిస్తేనే జన్యు వైవిధ్యంతో పుట్టే పిల్లలు ఆరోగ్యంతో ఉంటారని సూచిస్తున్నారు. అందుకే పిల్లలకు చిన్నప్పుడే ‘‘బావే నీ మొగుడు.. మరదలే నీ పెళ్లం’’ అని నూరిపోయకండి అంటున్నారు.

Tags:    

Similar News