గుజ‌రాత్ హోం మంత్రి ఇంటికి నిప్పు...

Update: 2015-08-27 15:33 GMT
గాంధీజీ శాంతి మంత్రం ప‌ఠించిన నేల‌లో హింస చెల‌రేగుతోంది. సైనిక ప‌హారా న‌డుమ ప్ర‌జానీకం స్వేచ్ఛావాయువులు పీలుస్తోంది. ప‌టేల్ సామాజిక‌వ‌ర్గాన్ని ఓబీసీల్లో చేర్చాల‌న్న డిమాండ్ నానాటికీ తీవ్ర‌త‌ర‌మ‌వుతుండడంతో ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న‌లో పడింది. తాజాగా గుజ‌రాత్‌ హోం మంత్రి రజనీ పటేల్ ఇంటికి కొందరు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.  సూరత్, రాజ్ కోట్‌ల‌లో పటేళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో హింస తీవ్రంగా ఉంది.

   హార్ధిక్ నేతృత్వంలో ప‌టీదార్ అనామత్ ఆందోళన రోజు రోజుకు ఉధృత‌మ‌వుతోంది. మంగ‌ళ‌వారం రాత్రి భద్ర‌తా ద‌ళాల కాల్పుల్లో ఆరుగురు ఆందోళ‌న‌కారులు మృతిచెందారు. వీరి కుటుంబాల‌కు 30ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని హార్ధిక్ ప‌ట్టుబ‌డుతున్నాడు. రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల రీత్యా అహ్మ‌దాబాద్ -  ఢిల్లీ స‌హా 12 రైళ్లు ర‌ద్ద‌య్యాయి. 19 రైళ్ల‌ను దారి మ‌ళ్లించి న‌డిపారు. మ‌రో ఐదు రైళ్లు గుజ‌రాత్ రాకుండా వేరే మార్గం మ‌ళ్లించారు. ఆందోళ‌న‌కారులు సబ‌ర్మ‌తి రైల్వే స్టేష‌న్‌లో స‌ర‌కు ర‌వాణా రైలుకు నిప్పంటించేదుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళ‌న‌ల‌కు క‌ల‌త చెందిన  సీఎం ఆనందీబెన్  శాంతి కాముక రాష్ట్రంలో హింస‌కు తావే లేద‌ని పేర్కొంటూ.. మీడియా ద్వారా సందేశించారు.

  గుజరాత్‌ లో ప‌టేళ్ల ఆందోళ‌న‌పై పీఎం మోడీ స్పందించారు. అన్నివ‌ర్గాల సంక్షేమానికీ త‌మ ప్ర‌భుత్వం కట్టుబ‌డి ఉంద‌ని ట్వీట్ చేశారు. స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌ల ద్వారా పరిష్క‌రించుకోవాల‌ని సూచించిన మోడీ...గాంధీజీ న‌డిచిన నేల‌లో ఇలాంటి హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు త‌గ‌ద‌న్నారు.
Tags:    

Similar News