వెరీ గుడ్ హోం మంత్రి గారూ ..!

Update: 2022-04-28 09:30 GMT
మ‌నుషులు స్పందిస్తే విషాదాలు కొన్ని ఆగుతాయి. రెప్ప‌పాటు దూరంలో జ‌రిగిన ప్ర‌మాదాన్ని గుర్తించి స్పందించిన ఆ అమాత్యురాలు ఇవాళ బాధితుల దీవెన‌లు అందుకుంటున్నారు. స్థానిక ప్ర‌జ‌లు  ఘ‌ట‌నా స్థ‌లిలో ఆమె ప్ర‌వ‌ర్తించిన ప‌ద్ధ‌తి, స్పందించిన తీరు అన్నింటి గురించి వివ‌రంగా చెప్పి, ఆప‌ద స‌మ‌యంలో ఆపన్న హ‌స్తం అందించిన మంత్రి చొర‌వ‌నూ, స్పంద‌న‌నూ ప్ర‌శంసిస్తున్నారు. కేవ‌లం అటుగా వెళ్తూ చూసీ చూడ‌కుండా వెళ్లిపోకుండా ప్ర‌మాద బాధితులను ఆస్ప‌త్రికి చేర్చే వ‌ర‌కూ ఉండి, అటు పైనే ఆమె త‌న కాన్వాయ్ ను క‌దిలించిన తీరు ఎంతైనా అభినందనీయం అని అంటున్నారు అక్క‌డి ప్ర‌త్య‌క్ష సాక్షులు.

నాకెందుకులే అనే త‌త్వం విపరీత ధోర‌ణుల‌కు దారి తీస్తుంది. కన్నీళ్లు తుడిచే వేళ  బాధ్య‌త గ‌ల మ‌నిషి గొప్ప‌వాడు అయి ఉంటాడు. ప్రేమ ద‌య అన్న‌వి పంచే విష‌యంలో మ‌నుషుల‌కు ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటులో ఉన్న ల‌క్ష‌ణాలు కావాలి. అవి ఎన్న‌టికీ ఎక్క‌డికీ దేహాన్ని వీడి వెళ్ల కూడ‌దు. ప్ర‌జ‌ల‌ను ప్రేమించ‌డం చేత‌గాని నాయ‌కుల కార‌ణంగానే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కానీ ఆమె నిన్న‌టి వేళ మాన‌వ‌త‌ను చాటుకున్నారు.

హోం మంత్రిగా ఎన్నో విమ‌ర్శ‌లున్నా కూడా వాటి సంగ‌తి అటుంచితే ఆమె ఔదార్యం చాటుకున్నారు. అటుగా రోడ్డు మీద స‌హాయం కోసం అర్థిస్తున్న దంపతుల‌ను ఆస్ప‌త్రికి త‌రలించారు. మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు.

మంత్రి స్వ‌యంగా అంబులెన్స్ కు ఫోన్ చేసి, వ‌చ్చేదాకా ఆగి బాధితుల‌కు అప్ప‌టి వ‌ర‌కూ ధైర్యం చెప్పి, అంబులెన్స్ సేవ‌లు వారికి అందే వ‌ర‌కూ అక్క‌డే ఉండి అటుపై ఆమె క‌దిలారు. ఓ ప్ర‌జా ప్ర‌తినిధిగా ఆమె ఇవాళ ఎంద‌రో మ‌న్న‌న‌లు అందుకుంటున్నారు. మంచి మ‌న‌సు ఉన్న నాయ‌కురాలు ఆమె అని అంతా కితాబిస్తున్నారు.

మంత్రులంతా మంచివాళ్లే.. మ‌నుషులంతా మంచివాళ్లే.. ఇలా చెప్ప‌డ‌మే సిస‌లు ధ‌ర్మం. క‌ష్టం, సుఖం వీటిని గుర్తించి తోటి వారికి అండ‌గా నిలిచిన సంద‌ర్భాలే మ‌నుషుల గుణాల‌ను లోకానికి చాటుతాయి. మ‌నిషి గుణం ఒక్క‌టే కాదు న‌డ‌వ‌డి కూడా లోకం గుర్తిస్తుంది.. తోటి వారి ఇబ్బంది, వారి అప‌రిష్కృత స‌మ‌స్య వీటిని ప్ర‌జా  జీవితాల్లో ఉన్న‌వారు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేందుకు క‌నీస స్థాయిలో స్పందించ‌గ‌ల‌గాలి. ఆలోచించ‌గ‌ల‌గాలి. ఆంధ్రావ‌ని వాకిట హోం మంత్రి చేసిన సాయం ఎంద‌రికో  స్ఫూర్తి. మంగ‌ళ‌గిరి స‌మీపాన రోడ్డు ప్ర‌మాద బాధితుల‌ను ఆదుకున్న వైనం ఎంద‌రికో  స్ఫూర్తి.

ఆప‌ద‌ లో ఉన్న వారిని ఆదుకోవ‌డం మాన‌వ‌త్వం. ప్ర‌మాద‌క‌ర స్థితి నుంచి ఒడ్డెక్కించ‌డం అన్న‌ది మ‌నిషి గుణం. ఎన్నో క‌ష్టాలు దాటిన మ‌నిషికి మ‌రో మ‌నిషి అండ‌గా నిలిచే సంద‌ర్భ‌మే అరుదైన‌దే కాదు జ్ఞాప‌క సంబంధ‌మైన‌ది కూడా ! అందుకే మ‌హ‌నీయ‌త‌త్వం మాన‌వ‌త్వంలోనే  ఉంది అంటారు. ఆ విధంగా నిన్న‌టి వేళ హోం మంత్రి తానేటి వ‌నిత స‌హృద‌య‌త‌ను చాటారు.
Tags:    

Similar News