రఘురామరాజుకు హోంశాఖ షాక్ ఇచ్చిందా?

Update: 2022-07-01 06:30 GMT
వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర హోంశాఖ పెద్ద షాకిచ్చింది. తనను ఏపీ పోలీసులు అరెస్టు చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లాను కలిసి విజ్ఞప్తి చేశారు. అసలు తనను పోలీసులు ఎందుకు అరెస్టు చేయాలని అనుకుంటున్నారు ? అరెస్టు చేస్తామని ఎవరు చెప్పారు అన్న విషయాలను మాత్రం ఎంపీ చెప్పటంలేదు.

ఎంతసేపు పోలీసులు తనను అరెస్టు చేసేందుకు రెడీగా ఉన్నారని మాత్రమే గోల చేస్తున్నారు. జూలై 4వ తేదీన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నరేంద్ర మోడీ భీమవరం వస్తున్నారు. ఆ కార్యక్రమంలో మోడీతో కలిసి పాల్గొనాలన్నది ఎంపీ ఆలోచన. ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు పోలీసులు తనను ఎందుకు అరెస్టు చేస్తారనే విషయాన్ని మాత్రం ఎంపీ చెప్పటంలేదు.

తనకు వ్యతిరేకంగా పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నట్లు నానా రచ్చ చేస్తున్న ఎంపీ చివరకు ఇదే విషయమై కోర్టులో కేసు వేయబోతున్నారు. తన రక్షణకు భద్రత కల్పించాలని కోర్టులో కేసు వేయబోతున్నట్లు ఎంపీ చెప్పారు.

అంటే ఎంపీ విజ్ఞప్తిని కేంద్ర హోంశాఖ పట్టించుకోలేదని అర్ధమైపోతోంది. ఎంతసేపు ఆరోపణలతోనే కాలం గడుపుతున్న ఎంపీ అందుకు తగిన ఆధారాలను మాత్రం చూపటంలేదు. అందుకనే హోంశాఖ కూడా పట్టించుకునుండదు.

ఏదో తనకున్న పరిచయాలతో హోంశాఖలో అందరినీ కలుస్తున్నారు గానీ ఈయన మాటకు పెద్దగా విలువున్నట్లు లేదు. అయినా అరెస్టు చేస్తారని, ప్రాణాలకు హాని ఉందని గోలచేస్తున్న ఎంపీ అసలు భీమవరంకు రాకపోతే ఏమైపోతుంది ? ప్రధానమంత్రి వచ్చినపుడు నియోజకవర్గంలో ఎంపీ ఉండాలనే నిబంధనేదీ లేదు.

అలాంటి ప్రోటోకాల్ నిబంధనే ఉంటే మోడి ఏపీలో పర్యటించినపుడు 2018లో చంద్రబాబునాయుడు వెళ్ళలేదు. ఇపుడు కేసీయార్ కూడా హాజరు కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Tags:    

Similar News