హ‌నీని అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు

Update: 2017-10-03 11:47 GMT
దాదాపు ఐదు వారాల నుంచి త‌ప్పించుకు తిరుగుతున్న హ‌నీప్రీత్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్ప‌ద డేరా స‌చ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ సింగ్ అలియాస్ డేరాబాబా ద‌త్త‌పుత్రిక‌గా చెప్పే హ‌నీప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్ద‌రు సాధ్వీల‌ను అత్యాచారం చేసిన ఉదంతంలో డేరా బాబాకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించ‌టం.. ఆయ‌న్ను త‌ప్పించేందుకు పెద్ద ఎత్తున హింస‌కు ప‌థ‌క ర‌చ‌న చేశార‌న్న‌ది హ‌నీ మీద ఉన్న ఆరోప‌ణ‌.
 
డేరా బాబా అరెస్ట్ త‌ర్వాత అండ‌ర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయిన హ‌నీని ప‌ట్టుకునేందుకు హ‌ర్యానా పోలీసులు విప‌రీతంగా ప్ర‌య‌త్నించారు. అయితే.. వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. పంజాబ్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. దాదాపు 38 రోజులుగా హ‌నీని అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించినా వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అదే స‌మ‌యంలో ముంద‌స్తు బెయిల్ కోసం హ‌నీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌గా ముందుగా లొంగిపోవాల‌ని త‌ర్వాత బెయిల్ గురించి ద‌ర‌ఖాస్తు చేయాల‌ని కోర్టు తేల్చింది. దీంతో.. ఆమె లొంగిపోవ‌టం మిన‌హా మ‌రో మార్గం లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే.. ఊహించ‌ని రీతిలో ఈ రోజు (మంగ‌ళ‌వారం) కొన్ని మీడియా సంస్థ‌ల‌కు హ‌నీప్రీత్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఇదో సంచ‌ల‌నంగా మారింది. పోలీసుల‌కు ఎంత‌కూ దొర‌క‌ని హ‌నీ.. మీడియాకు మాత్రం ఇంట‌ర్వ్యూలు ఇచ్చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది. మీడియాలో హ‌నీ ఇంట‌ర్వ్యూలు ప్ర‌సార‌మైన కొద్ది గంట‌ల్లోనే ఆమెను అరెస్ట్ చేసిన‌ట్లుగా పంజాబ్ పోలీసులు ప్ర‌క‌టించ‌టం గ‌మ‌నార్హం.

పంజాబ్ లోని మొహాలీ పోలీసులు హ‌నీని అదుపులోకి తీసుకొన్నార‌ని.. అయితే ఆమెను ప‌ట్టుకునే విష‌యంలో క్రెడిట్ ను సొంతం చేసుకోవ‌టానికి పంజాబ్‌.. హ‌ర్యానా పోలీసుల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రిగింద‌న్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా హ‌నీని అదుపులోకి తీసుకున్నామ‌ని.. పంచ‌కుల కోర్టులో ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లుగా పంచ‌కుల పోలీస్ క‌మిష‌న‌ర్ ఏఎస్ చావ్లా ధ్రువీక‌రించారు.
Tags:    

Similar News