ట్రంప్ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పిందామె

Update: 2016-06-26 10:03 GMT
తన ఘాటు వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తిగా మారారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్న డోనాల్డ్ ట్రంప్. ముస్లింలు.. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ట్రంప్ కి అలవాటే. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫు అభ్యర్థిగా ఫైనల్ అయిన నాటి నుంచి ఆయన నోటి మాటలో కాస్త మార్పు రావటం మొదలైంది. దీనికి తగ్గట్లే తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ట్రంప్ వైఖరి మారిందనటానికి నిదర్శనంగా చెప్పొచ్చు.

ముస్లింలపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. ఉగ్రవాద రహిత దేశాల నుంచి వచ్చే ముస్లింల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన ట్రంప్ మాటలు ఇప్పుడు చర్చగా మారాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ ప్రచార కార్యక్రమాల్ని దగ్గర ఉండి చూసుకొని.. ఆయన విధానాలకు సంబంధించిన ప్రకటనల్ని విడుదల చేసే హోప్ హిక్స్ తాజాగా ట్రంప్ ను ఎలా అర్థం చేసుకోవాలంటే అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అమెరికాలోకి ముస్లింల ప్రవేశాన్ని అడ్డుకోవాలని.. జనవరిలో జరిగిన ఒక ప్రచార సభలో ట్రంప్ అన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయని.. నిజానికి ఆ సందర్భంలో ట్రంప్ మాటలకు అర్థం వేరుగా హిక్స్ చెప్పుకొచ్చారు. ట్రంప్ మాటల వెనుక అర్థం గురించి వివరించే ప్రయత్నం చేసిన ఆమె.. తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ముస్లింలతో అమెరికాకు ఎక్కువ ముప్పు ఉందని చెప్పటమే ఆయన ఉద్దేశంగా చెప్పుకొచ్చారు.

‘‘ఉగ్రవాదం అధికంగా ఉన్న దేశాలు ఎంత ప్రమాదకరంగా మారాయో అందరికి తెలిసిందే. కాబట్టే అక్కడ నుంచి వచ్చే వారిని మాత్రమే రానివ్వొద్దన్నదే ట్రంప్ ఉద్దేశం’’ అంటూ కవరింగ్ ఇవ్వటం గమనార్హం. జులైలో  ఆయన అభ్యర్థిత్వం ఖరారు కానుంది. అయితే.. ట్రంప్ ను సొంత పార్టీ సభ్యులే తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన్ను అందరికి ఆమోదనీయమైన నేతన్న ఇమేజ్ కలిగించే ప్రయత్నంలో భాగంగా తాజా కవరింగ్ అన్న వాదన వినిపిస్తోంది. మరి.. దీనిపై రిపబ్లికన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయినా.. జనవరిలో చేసిన వ్యాఖ్యలకు జూన్ లో వివరణ ఇవ్వటం ఏమిటి చెప్మా..?
Tags:    

Similar News