మళ్లీ మోదీయే.. షాకిచ్చిన ములాయం

Update: 2019-02-13 13:14 GMT
దేశంలో రాజకీయాలు ఏ రోజు ఏ క్షణం ఎటు మలుపు తిరుగుతాయో చెప్పడం కష్టం. నిన్న ఒక పార్టీలో ఉన్నవాళ్లు రేపు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేకపోతున్నారు. అసలే ఇది ఎన్నికల సీజన్‌. దీంతో కార్యకర్తలే కాదు సీనియర్‌ లీడర్లు కూడా ఏ టైమ్‌లో ఏ టర్న్‌ తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి స్టేట్‌మెంట్‌తో అందరికి షాక్‌ ఇచ్చాడు సీనియర్‌ నేత ములాయం సింగ్‌ యాదవ్‌. లోక్‌ సభ నిరవధిక వాయిదాకు ముందు సభలో మాట్లాడిన ములాయం.. మోదీ చాలా బాగా పనిచేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో కూడా మోదీయే విజయం సాధించి మళ్లీ ప్రధాని అవుతారని అన్నారు ములాయం. దీంతో షాక్‌ అవ్వడం విపక్షాల వంతు అయ్యింది. ఎన్టీయే సభ్యులు మాత్రం హర్షధ్వానాలు తెలిపారు. మోదీ కూడా ములాయంను చూసి నమస్కరిస్తూ చిరునవ్వులు చిందించారు.

ఉత్తరప్రదేశ్‌ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీని దెబ్బకొట్టేందుకు బద్ధ శత్రువులు అయినా ఎస్పీ, బీఎస్పీ కలిశాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి. ఇక ఎన్టీయేకు వ్యతిరేకంగా ఉన్నపార్టీలతో చాలా సఖ్యతగా ఉంటున్నారు ములాయం తనయుడు అఖిలేష్‌ యాదవ్‌. ఇలాంటి టైమ్‌ లోములాయం వ్యాఖ్యలతో అటు అఖిలేష్‌ సహా అందరూ షాక్‌ అయ్యారు. మరోవైపు రాహుల్‌ గాంధీ ములాయం వ్యాఖ్యలను సీరియస్‌ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. సీనియర్‌ గా నేతగా ములాయంను గౌరవిస్తామని.. అంతకుమించి ఆయన వ్యాఖ్యల్లో అంతరార్థం, నిగూరార్ధాలు ఏమీ లేవని అన్నారు. మరోవైపు ఎస్పీ, బీఎస్పీ కూటమిని దెబ్బకొట్టేందుకే మోదీ ఈ స్కెచ్‌ వేశారని వార్తలు వస్తున్నాయి. ములాయం మాత్రమే కాదు.. ఎన్నికల స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిశోర్‌ కూడా వచ్చే ఎన్నికల్లో మోదీ మళ్లీ ప్రధాని  కావడం ఖాయం అని అన్నారు. ములాయం.. ప్రశాంత్‌ కిశోర్.. చూస్తుంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోందన్న విషయం మాత్రం స్పష్టం అవుతుంది.
Tags:    

Similar News