ప్రాణాలు కాపాడిన గ్రామస్తులకు ఆసుపత్రి.. అసలుసిసలు పే బ్యాక్

Update: 2022-08-10 06:13 GMT
దాదాపు రెండేళ్ల క్రితం కేరళలోని కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సిన ఎయిరిండియా ఫ్లైట్ గతి తప్పి రన్ వే మీదకుదూసుకెళ్లటం.. రెండు ముక్కలైన విమానంలో 18 మంది మరణించటం.. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడటం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలెట్.. కో పైలెట్ తో పాటు మొత్తం 18 మంది దుర్మరణం పాలయ్యారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో చిమ్మ చీకటి కమ్ముకొని.. వాతావరణం ఏ మాత్రం సరిగా లేని వేళ.. స్పందించిన దగ్గరి గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి.. విమానంలో గాయపడిన వారిని రక్షించి.. వైద్య సాయం అందించిన వైనం తెలిసిందే.

అలా ఈ విమాన ప్రమాదంలో గాయపడిన వారు.. మరణించిన వారికి సంబంధించిన వారంతా కలిసి 184 మందితో మలబార్ డెవలప్ మెంట్ ఫోరం పేరుతో ఒక వేదికను సిద్ధం చేశారు.అందరూ కలిసి రూ.50 లక్షలు సేకరించారు. నాటి కాళరాత్రిలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ఆదుకున్న వారికి తగిన సాయం చేయటం కోసం ఆసుపత్రిని నిర్మించారు.

ఎయిర్ పోర్టుకు దగ్గర్లోని కరిపుర్ గ్రామస్తులకు విమానంలో ప్రయాణించిన వారు అసలుసిసలు పే బ్యాక్ చేసి.. తమ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేశారు.

ఈ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్ పేషెంట్ సదుపాయాలు.. ఫార్మసీ.. లేబొరేటరీతో పాటుప్రభుత్వ వైద్య సాయం అందించే ఆసుపత్రి ఇదొక్కటే అవుతుందని చెబుతున్నారు. విమాన ప్రయాణం జరిగిన సమయంలో దగ్గర్లోనే ఆసుపత్రి ఉన్నప్పటికీ.. అందులో సదుపాయాలు లేకపోవటంతో తమకు ఎలాంటి ఉపయోగం లేకపోయిందని..అందుకే తామీ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా పేర్కొన్నారు.

ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే మొదలుకానుంది. తమ ప్రాణాల్ని కాపాడిన గ్రామస్తుల కోసం చేస్తున్న ఈ పని అందరి మనసుల్ని దోచేస్తుంది. ఈ ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుకుందాం.
Tags:    

Similar News