హాస్టల్స్ మూసేస్తున్నారు.. ఎక్కడికి పోవాలి బ్రో?

Update: 2020-03-18 09:31 GMT
రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్న ఏకైక మహానగరం హైదరాబాదే. విద్య కోసం కావొచ్చు.. ఉపాధి కోసం కావొచ్చు.. కోచింగ్ కోసమైనా.. ఇతర కారణాలు ఏవైనా సరే.. హైదరాబాద్ బాట పడుతుంటారు. బెంగళూరు.. చెన్నై మహానగరాలు ఉన్నా.. అక్కడితో పోలిస్తే.. హైదరాబాద్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలా మహానగరానికి వచ్చే వారు ఉండేందుకు సొంతంగా ఇంటి కంటే కూడా.. హాస్టల్స్.. పీజీల్లో అద్దెకు దిగుతుంటారు. ఇంటి సెటప్ కు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావటం.. దాని కంటే నిర్వహణ తక్కువగా ఉండటం తో పాటు.. ఖర్చు విషయంలోనూ కాస్త తక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో హాస్టల్స్ లో ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది.

కరోనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్ లోని హాస్టల్స్ ను ఖాళీ చేయిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహానగరంలో మరెక్కడా లేని విధంగా అమీర్ పేట.. ఎస్సార్ నగర్ ప్రాంతాల్లోని పలు హాస్టల్స్ లోని వారిని 48 గంటల్లో ఖాళీ చేసి వెళ్లిపోవాలన్న ఆదేశాలు జారీ చేశారు. స్థానిక అధికారుల తో పోలిస్తే.. నేతల ప్రమేయమే ఎక్కువగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఉన్నపళంగా హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లాలంటే తాము ఎక్కడకు వెళ్లాలన్నది ఇప్పుడు సమస్యగా మారింది.

విద్యార్థులైతే.. ఊరికి వెళ్లిపోవచ్చు. కానీ.. చిరుద్యోగులు.. ఆసుపత్రులు.. ఇతర కారణాల తో సిటీలో ఉండాల్సిన వారి పరిస్థితి ఎలా? అన్నది క్వశ్చన్ గా మారింది. ఇలా.. వెళ్లిపొమ్మంటే ఎలా? అని పలువురు ప్రశ్నిస్తున్నా.. అదంతా తమకు తెలీదని.. అధికారుల ఆదేశాల్ని అమలు చేయటమే తమ పనిగా చెబుతున్నారు. దీంతో.. వేలాది మంది తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు.
Tags:    

Similar News