జ‌ర్న‌లిస్టుల మ‌న‌సు తెలుసుకున్న జ‌గ‌న్‌

Update: 2017-12-28 04:38 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును మీడియా ఫ్రెండ్లీ నేత‌గా చెబుతారు. ఆ మాట కాసేపు నిజ‌మే అనుకుందాం. గ‌తంలో తొమ్మిదిన్న‌రేళ్లు ముఖ్య‌మంత్రిగా.. తాజాగా మూడున్న‌రేళ్లుగా ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు.. త‌న‌కెంతో ఇష్ట‌మైన జ‌ర్న‌లిస్టుల‌కు ఏం చేశారు? అన్న సూటిప్ర‌శ్న వేస్తే.. ఏమీ చేయ‌లేద‌న్న స‌మాధానం ట‌క్కున వ‌స్తుంది.

మ‌రి.. మీడియా ఫ్రెండ్లీ ట్యాగ్ మాటేందన్న ప్ర‌శ్న‌ను అమాయ‌కంగా వేస్తే.. బాబు గురించి తెలీదా?  చేసేది చెప్ప‌రు.. చెప్పేదేదీ చేయ‌రంటూ చిద్విలాసంగా ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. బాబు మీడియా ఫ్రెండ్లీ కాదు.. మీడియా అధినేత‌ల ఫ్రెండ్లీ అంటూ స‌రిదిద్దేవారు లేక‌పోలేదు. తాను ఎవ‌రినైతే నిచ్చెన‌లా వాడుకొని పైకి ఎక్కుతారో.. వారిని ఏ మాత్రం ప‌ట్టించుకోని తత్త్వం చంద్ర‌బాబులో ఎక్కువే. అందుకు జ‌ర్న‌లిస్టులు కూడా మిన‌హాయింపు కాదు.

నిజంగా జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌భుత్వ సాయం అవ‌స‌ర‌మా? అని ఆరాగా అడిగే వారు క‌నిపించ‌క‌పోరు. మీడియా వాళ్లు అన్నంత‌నే హ‌వా న‌డిపించే వారు.. దందాలు చేసే వారుగా గుర్తుకు వ‌స్తారు. ఇదంతా కూడా ఈ మ‌ధ్య‌న మొద‌లైందే. నేటికి.. వృత్తిని ప‌ర‌మ ప‌విత్రంగా చూస్తూ.. యాజ‌మాన్యాలు ఇచ్చే అర‌కొర జీతాల‌తో బతుకు బండి లాగేసే వాళ్లు కొల్ల‌లు కొల్ల‌లుగా క‌నిపిస్తారు.

అద్భుత‌మైన టాలెంట్ ఉండి కూడా.. స‌మాజం మీద అనురక్తి.. తోటి మ‌నుషుల‌కు చేత‌నైనంత సాయం చేసేందుకు త‌పించే వారు క‌నిపిస్తుంటారు. గ‌డిచిన ప‌ది.. ప‌దిహేనేళ్లుగా పాత్రికేయంలో కూడా ప‌ద్ద‌తులు మారుతున్నా.. ఇప్ప‌టికి పెద్ద ఎత్తున మార్పులు రాలేద‌ని చెప్పాలి. ఈ కార‌ణంతోనే జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏదైనా చేస్తే బాగుంటుంద‌న్న డిమాండ్‌ ను ప‌లువురు తెర మీద‌కు తెస్తుంటారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. మిగిలిన వ‌ర్గాల‌కు ఇచ్చిన‌ట్లే జ‌ర్న‌లిస్టుల‌కు భారీగా హామీలు ఇచ్చారు చంద్ర‌బాబు. మిగిలిన వారికి చేయిచ్చిన చందంగానే జ‌ర్న‌లిస్టుల‌కు చేయిచ్చారు. ఇలాంటి వేళ‌.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ఊహించ‌ని రీతిలో ఆయ‌న వ‌రాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన జ‌ర్న‌లిస్టులు అంద‌రికి త‌ప్ప‌నిస‌రిగా ఇళ్ల స్థ‌లం ఇస్తామ‌ని.. ఎవ‌రెవ‌రికి పెండింగ్ లో ఉన్నాయో.. వాట‌న్నింటిని ప‌రిశీలించి న్యాయం చేస్తామ‌న్నారు.

జ‌ర్న‌లిస్టులంద‌రికి స్థ‌లం ఉండాల‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌.. పాత్రికేయుల‌కు పెన్ష‌న్ ఇచ్చే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. ఏయే రాష్ట్రాల్లో ఎంతెంత ఇస్తున్నారు? ఎక్క‌డెక్క‌డ అమ‌ల‌వుతుందో ప‌రిశీలించి న్యాయం చేస్తాన‌న్నారు. ఏపీలో జ‌ర్న‌లిస్టుల మీద దాడులు జ‌రుగుతున్నాయ‌న్న విష‌యాన్ని కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు జ‌గ‌న్ దృష్టికి తీసుకురాగా.. అలాంటివాటిని స‌హించ‌మ‌న్నారు. జ‌ర్న‌లిస్టుల మీద దాడులు జ‌రిగితే అలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన చంద్ర‌బాబు.. చ‌ప్ప‌ట్లు కొడ‌తారంటూ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. పాత్రికేయుల్ని ప‌ట్టించుకోకుండా పోతున్న చంద్ర‌బాబుకు భిన్నంగా జ‌ర్న‌లిస్టుల విష‌యంలో జ‌గ‌న్ రియాక్ట్ అయ్యార‌ని చెప్పాలి. 
Tags:    

Similar News